సంక్షోభంలో రైస్ మిల్లులు | Rice mills in crisis | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో రైస్ మిల్లులు

Published Thu, Oct 29 2015 12:27 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

సంక్షోభంలో రైస్ మిల్లులు - Sakshi

సంక్షోభంలో రైస్ మిల్లులు

లెవీని పూర్తిగా ఎత్తివేయడంతో ధాన్యం కొనుగోళ్లు బంద్
♦ 2,500 మిల్లుల్లో ఇప్పటికే 1,500కు పైగా మూత
♦ లక్ష మంది కార్మికులపై ప్రభావం
 
సాక్షి,హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో రైస్ మిల్లులు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. జీరో లెవీ విధానం రైస్ మిల్లర్లు, వాటిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న హమాలీల పాలిట శాపంగా మా రింది. లెవీ(మిల్లర్లు సేకరించిన ధాన్యంలో ఎఫ్‌సీఐకి తప్పనిసరిగా ఇవ్వాల్సిన వాటా)ని పూర్తిగా ఎత్తివేయడంతో ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లి, మిల్లర్లకు పనిలేకుండా పోయింది. దీంతో ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 1,500 మిల్లులు మూతపడ్డాయి. మరికొన్ని మూత పడేందుకు సిద్ధంగా ఉన్నా యి. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కస్టమ్ మిల్లింగ్ చార్జీలను పెంచితే తప్ప పరిశ్రమ మనుగడ కష్టమేనని మిల్లర్లు అంటున్నారు. ఈ దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చేం దుకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా రైస్‌మిల్లుల బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు.

 జీరో లెవీతో దెబ్బ...
 రాష్ట్రంలో ఉన్న 2,500 రైస్ మిల్లుల నుంచి 50 లక్షల టన్నుల మేర ధాన్యం సేకరణ జరిగేది. 25 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరిగేది. మొత్తంగా ఒక్కో రైస్‌మిల్లులో హమాలీలు మొదలు డ్రైవర్లు, క్లీనర్ల వరకు 50 నుంచి 100 మంది వరకు ఉపాధి లభించేది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిల్లుల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షకు మించి ఉంటుందని అధికారవర్గాలే చెబుతున్నాయి. అయితే కనీస మద్దతు ధరను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించిన కేంద్రం.. క్రమంగా లెవీ విధానాన్ని ఎత్తివేసింది. 2014 మార్చి వరకు 75శాతంగా ఉన్న లెవీని గతేడాది 25 శాతానికి తగ్గిం చింది.

దీనిని అనేక రాష్ట్రాలు వ్యతిరేకించినా వెనక్కి తగ్గని కేంద్రం.. ఈ ఏడాది నుంచి పూర్తిగా లెవీని ఎత్తివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నాయి. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు ఇచ్చే కస్టమ్ మిల్లిం గ్ ధరపైనే రైస్ మిల్లులు ఆధారపడాల్సి ఉం టోంది. ఇది గిట్టుబాటు కాకపోవడంతో గతేడాదే 500, ఈ ఏడాది మరో వెయ్యికి పైగా మిల్లులు మూతపడ్డాయి.

 దక్కని హామీ...
 ప్రతి సీజన్‌లో పౌరసరఫరాల శాఖ తాను సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు మిల్లర్లకు అప్పగిస్తుంది. మిల్లర్లు 100 క్వింటాళ్ల ధాన్యానికి పచ్చిబియ్యం (రా రైస్) అయితే 67 క్వింటాళ్లు, ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) అయితే 68 క్వింటాళ్లు పౌరసరఫరాల శాఖకు ఇవ్వాలి. ఇలా మార్చి ఇచ్చినందుకు పచ్చి బియ్యానికి క్వింటాల్‌కు రూ.15, ఉప్పుడు బియ్యానికి రూ.25 చెల్లిస్తారు. దీనినే కస్టమ్ మిల్లింగ్ అంటారు. ఇలా వచ్చిన బియ్యాన్నే పౌరసరఫరాల శాఖ రేషన్‌కార్డు దారులకు సరఫరా చేస్తుంది. అయితే వంద క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 61 నుంచి 62 క్వింటాళ్ల వరకు మాత్రమే బియ్యం వస్తోందని మిల్లర్లు చెబుతున్నారు.

ప్రభుత్వం నిర్ధారించిన మేరకు ఇవ్వాలంటే తాము మరో నాలుగైదు క్వింటాళ్లు అదనంగా కలపాల్సి వస్తోందని, దీంతో తమకు నష్టం కలుగుతోందని అంటున్నారు. ఈ దృష్ట్యా క్వింటాల్ ధాన్యానికి ఎంత బియ్యం, ఎంత నూక, పొరం, తవుడు వస్తుందన్నది ధాన్యం సేకరణకు ముందే టెస్ట్ మిల్లింగ్ చేసి నిర్ధారించాలని కోరుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక కస్టమ్ మిల్లింగ్ ధరను క్వింటాల్ పచ్చిబియ్యానికి రూ.75, ఉప్పుడు బియ్యానికి రూ. 100కు పెంచాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు.
 
 లెవీ అంటే..?
 భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) బియ్యం సేకరణ విధానమే లెవీ. అంటే రైతుల నుంచి మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యంలో ఎఫ్‌సీఐ కొంత మొత్తాన్ని కచ్చితంగా తీసుకోవడం. ప్రభుత్వం నిర్ధారించిన మేరకు చాలా సంవత్సరాల పాటు ఎఫ్‌సీఐ 75 శాతం లెవీని అమలు చేసింది. ఆ తరువాత కొద్ది సంవత్సరాల పాటు 50 శాతం, చివరగా గతేడాది 25 శాతం అమలు చేసింది. ఈ ఏడాది పూర్తిగా లెవీ విధానానికి స్వస్తి చెప్పింది. ఈ కారణంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడాన్ని మిల్లర్లు ఆపేశారు. ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పౌరసరఫరాల సంస్థలు చేపట్టాయి.
 
 రాష్ట్ర పరిశ్రమలను పట్టించుకోరా?
  ‘‘రాష్ట్ర ప్రభుత్వం టీఎస్-ఐపాస్ అని, ప్రత్యేక ప్రోత్సాహకాలని విదేశీ పరిశ్రమలకు రెడ్ కార్పెట్ వేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో రైస్‌మిల్ పరిశ్రమలు మూతపడి లక్షల మంది కార్మికుల ఉపాధి పోతుంటే మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకొని రైస్ మిల్లులను ఆదుకోవాలి.’’ - వ డ్డి మోహన్‌రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement