
వైద్యో నారాయణో ‘హరీ’
ఇక్కడ కన్పిస్తున్నది అనంతపురంలోని ఎర్రనేల కొట్టాలలో ఉన్న స్నేహ మెడికల్ షాప్. ఇందులోనే ప్రథమ చికిత్స కేంద్రం ఉంది.
– జిల్లాలో ఆర్‌ఎంపీల ఆగడాలు
– ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు
– తాజాగా గోరంట్లలో చిన్నారి మృతి
– హద్దుదాటి వైద్యం చేస్తున్న వైనం
– సాక్షి పరిశీలనలో బట్టబయలు
– నిర్లక్ష్యం వీడని వైద్య ఆరోగ్యశాఖ
ఇక్కడ కన్పిస్తున్నది అనంతపురంలోని ఎర్రనేల కొట్టాలలో ఉన్న స్నేహ మెడికల్ షాప్. ఇందులోనే ప్రథమ చికిత్స కేంద్రం ఉంది. ఇక్కడే ఫ్యాన్సీ స్టోర్ కూడా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఓ వ్యక్తి అనారోగ్యంగా ఉందని వస్తే ఇదిగో ఇలా బెంచీపైనే సెలైన్ ఎక్కించారు. కాసులకు కక్కుర్తి పడి ‘హద్దులు’దాటి వైద్యం చేశారు. వాస్తవానికి ఆర్‌ఎంపీ, పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. సూది మందు, సెలైన్లు ఎక్కించకూడదు. కానీ ఎవరూ దీన్ని పట్టించుకోవడం లేదు.
అనంతపురం మెడికల్: గోరంట్ల మండలం మల్లాపల్లి పంచాయతీ బూగానిపల్లికి చెందిన శంకర, రాధమ్మ దంపతుల కూతురు శ్రావణి (3)కి గత శుక్రవారం రాత్రి జ్వరం వచ్చింది. మరుసటి రోజు ఉదయం గోరంట్లలోని లక్ష్మీ వెంకటేశ్వర ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. పాపను ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేయాల్సిన ఆ ఆర్‌ఎంపీ ఇంజెక్షన్ వేసి పంపాడు. సాయంత్రమైనా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరోసారి అదే ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లారు. అప్పటికే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో హిందూపురం తీసుకెళ్లాలని సూచించగా మార్గంమధ్యలోనే శ్రావణి మృతి చెందింది. ఉదయం ఇంజెక్షన్ వేసినప్పటి నుంచి పాప ఆరోగ్యం క్షీణించిందని, మృతికి వైద్యుడే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఆ తల్లి కడుపుకోత మాటల్లో చెప్పలేనిది.
వైద్యం కోసం వెళ్తే ప్రాణాలు నైవేద్యంగా పెట్టాల్సి వస్తోంది. తెలిసీ తెలియని పరిజ్ఞానంతో ఆర్‌ఎంపీలు హద్దుదాటి వైద్యం చేస్తుండడంతో అమాయకులు బలవుతున్నారు. వైద్యో నారాయణో హరి అని ఆస్పత్రి మెట్లెక్కితే ప్రాణాలు ‘హరీ’ అంటున్నాయి. జిల్లాలో ఆర్‌ఎంపీ, పీఎంపీల ధనదాహం తారస్థాయికి చేరుతోంది. నిబంధనల మేరకు ఆర్‌ఎంపీ క్లినిక్‌లలో ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. సూది మందు, సెలైన్లు ఎక్కించకూడదు. కానీ అడిగేవారు లేకపోవడంతో ఏకంగా అత్యవసర కేసులను ఎల్లవేళలా చూస్తామని బోర్డులే పెట్టేస్తున్నారు. గోరంట్లలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆదివారం అనంతపురంలోని పలు ‘క్లినిక్’లను ‘సాక్షి’ పరిశీలించగా అసలు బండారం బయటపడింది.
అంతా కాసుల కక్కుర్తే
ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లతో చేసుకున్న ముందస్తు ఒప్పందాలతో తమ వద్దకు వచ్చే వారిని ఆర్‌ఎంపీలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పరీక్షల పేరుతో ల్యాబ్‌లకు, మెరుగైన వైద్యం పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులకు కాసుల పంట పండించి అందినకాడికి వెనకేసుకుంటున్నారు. క్లినిక్‌లలోనే మందుల దుకాణాలు నిర్వహిస్తూ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఏకంగా పడకలను సైతం ఏర్పాటు చేసుకుని సెలైన్లు ఎక్కిస్తున్నారు. ప్రథమ చికిత్సను మరచి అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు సొంతంగా మందులు రాసివ్వడం, వారే విక్రయించడం, రక్త, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇలాంటివి అనంతపురం నగరంలోనే 50కి పైగా ఉన్నాయి. గుంతకల్లు, హిందూపురం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, పెనుకొండ, కదిరి, గుత్తి, పుట్టపర్తి వంటి పట్టణాలే కాకుండా మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లోనూ ఆర్‌ఎంపీలు ఆడిందే ఆటగా సాగుతోంది.
వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై విమర్శలు
ఆర్‌ఎంపీలు ధనార్జనే ధ్యేయంగా ముందుకెళ్తుంటే కట్టడి చేయాల్సిన వైద్య ఆరోగ్యశాఖ తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఎక్కడికక్కడ మామూళ్లు అందుతుండడంతోనే చూసీ చూడనట్లు వెళ్తున్నారన్న విమర్శలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2 వేలకు పైగా ఆర్‌ఎంపీలు ఉన్నా నెలలో ఒక్కసారి కూడా తనిఖీలు చేసిన దాఖలా లేదు. ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకునే తీరిక లేకుండా గడుపుతున్నారు. అనంతపురం నగరంలోని ఎర్రనేలకొట్టాల, సోమనాథ్‌నగర్, సాయినగర్, రాజీవ్‌కాలనీ, పాతూరు తదితర ప్రాంతాల్లోని క్లినిక్‌లు ఇష్టారాజ్యంగా వైద్యం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల మందుల దుకాణాల నిర్వాహకులు ఆర్‌ఎంపీలకు ఒక గదిని కేటాయించి ప్రజలకు ఉచిత ఓపీ పేరుతో మందుల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆకస్మిక తనిఖీలు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వైద్యశాలలు నిర్వహిస్తుంటే మూసివేయాలన్న ఉత్తర్వులు ఉన్నా అమలు కావడం లేదు.
చర్యలు తీసుకుంటాం
ఆర్‌ఎంపీలు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి. ఇంజెక్షన్లు, సెలైన్స్ ఎక్కించకూడదు. క్లినిక్‌లలో బెడ్స్ ఉండకూడదు. పేరుకు ముందు డాక్టర్ అని రాసుకోకూడదు. జిల్లా వ్యాప్తంగా ఆర్‌ఎంపీల వైద్యంపై నిఘా ఉంచాలని మెడికల్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చాం. గోరంట్ల ఘటన బాధాకరం. అధికారులు వెళ్లి విచారణ చేపట్టారు. గుత్తిలో కూడా ఓ క్లినిక్‌పై ఫిర్యాదు వచ్చింది. దాడులు చేసి చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్‌ఓ