
హైవేపై ఆర్తనాదం
108 సిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వారి నిర్లక్ష్యం కారణంగానే తమవాడు చనిపోయాడంటూ మృతుని బంధువులు అంబులెన్స్‌ను ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందిపై దాడికి యత్నించారు.
• రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు
• 108 వాహనం కోసం గంటకు పైగా ఎదురుచూపు
• యువకుడి మృతితో కోపోద్రిక్తులైన బంధువులు
• అంబులెన్స్, సిబ్బందిపై దాడి, పరిస్థితి ఉద్రిక్తం
బుక్కరాయసముద్రం/ గార్లదిన్నె: 108 సిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వారి నిర్లక్ష్యం కారణంగానే తమవాడు చనిపోయాడంటూ మృతుని బంధువులు అంబులెన్స్‌ను ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందిపై దాడికి యత్నించారు. గార్లదిన్నె మండలం పెనకచెర్ల గ్రామానికి చెందిన నాగార్జున(25) ఆటో న డుపుకుని బతుకుతున్నాడు. తన అక్క కూతురైన సుమంజలితో ఆర్నెల్ల కిందట పెళ్లైంది. బుధవారం రాత్రి అనంతపురంలో పని ముగించుకుని బైక్‌లో ఇంటికి తిరుగుప్రయాణమయ్యాడు. వడియంపేట మిట్టపై ఉన్న షిరిడీ∙సాయి ఇంజినీరింగ్ కళాశాల వద్దనున్న పెట్రోలు బంక్ వద్దకు రాగానే అక్కడ పెట్రోల్ వేయించుకొని మళ్లీ బయలుదేరాడు. అంతలోనే వేగంగా వచ్చిన లారీ బైక్‌ను బలంగా ఢీకొంది. ఘటనలో నాగార్జునకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆలస్యంగా వచ్చిన అంబులెన్స్
ఘటనపై స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. అంతలోనే నాగార్జున చనిపోయాడు. జిల్లాలో సీఎం పర్యటన ఉండగా అంబులెన్స్‌లు పర్యటనకు వెళ్లాయి. దీంతో ప్రమాదం జరిగిన చాలా సేపటికి 108 రావడంతో బంధువులు దానిపై దాడి చేశారు. వాహన డ్రైవర్‌ను కొట్టేందుకు యత్నించారు. దీంతో రహదారిపై కంపలు వేసి అక్కడే స్థానికులతో సహా ఆందోళనకు దిగారు. వడియం పేట దగ్గర మూడు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులకు సర్ది చెప్పి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. గుత్తి టోల్‌గేట్ వద్ద ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణాలు పోతున్నా...అధికారులకు సీఎం పోగ్రామే ఎక్కువై పోయిందా అని మృతుని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.