Published
Sun, Sep 11 2016 1:05 AM
| Last Updated on Thu, Aug 30 2018 4:51 PM
టిప్పర్ల రవాణాతో రోడ్డు ధ్వంసం
అడ్డుకున్న జెడ్పీటీసీ వెంకటశేషయ్య
వెంకటాచలం: మండలంలోని కసుమూరు పంచాయతీ వెంకటకృష్ణాపురానికి వెళ్లే రోడ్డు టిప్పర్ల రద్దీతో పూర్తిగా ధ్వంసమైపోతుంది. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో స్థానిక రైతులు జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య ఆధ్వర్యంలో శనివారం టిప్పర్లను అడ్డుకున్నారు. కసుమూరులోని బుచ్చిరెడ్డిచెరువు నుంచి రైల్వేలైన్ నిర్మాణ పనులకు మట్టి తరలింపునకు అధికారులు అనుమతులిచ్చారు. దీంతో కొన్ని రోజులుగా టిప్పర్లు షఫాబావి మీదుగా వెంకటకృష్ణాపురం గ్రామానికి వెళ్లే మట్టిరోడ్డుపై ఈ టిప్పర్లు తిరుతుండటంతో రోడ్డు అధ్వానంగా మారింది. ఈ రోడ్డుపై టిప్పర్లు తిరగనివ్వద్దని గ్రామస్తులు, రైతులు అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో శనివారం జెడ్పీటీసీ వెంకటశేషయ్య అక్కడకు వెళ్లి టిప్పర్లును అడ్డుకున్నారు. మట్టిరోడ్డుపై 15 టన్నులకు పైగా బరువున్న టిప్పర్లు తిప్పడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని రెవెన్యూ, నీటి పారుదలశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. చెరువులో మట్టి తరలించిన వెంటనే రోడ్డు గురించి పట్టించుకోకుంటే ప్రజలు ఎలా తిరగాలని ప్రశ్నించారు. చెరువులో నుంచి మట్టి తరలించిన నిర్వాహకులతో అధికారులు రోడ్డును పటిష్ట పరిచేలా చర్యలు చేపట్టాలన్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.