
ఎంపీ రాయపాటి కార్యాలయంలో చోరీ
విజయవాడ : ఎంపీ రాయపాటి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో చోరీ జరిగిన సంఘటన నగరంలో సంచలనం కలిగించింది. పోలీసుల కథనం మేరకు.. భారతినగర్ సమీపంలో ఉన్న శ్రీనగర్ కాలనీలో ఎంపీ రాయపాటి క్యాంపు కార్యాలయం ఉంది. సిబ్బంది రోజులాగానే శుక్రవారం రాత్రి ఆఫీసుకు లాక్ చేసి ఇంటికి వెళ్లిపోయారు. శనివారం ఉదయం కార్యాలయానికి చేరుకున్న సిబ్బంది ప్రధాన ద్వారం తెరచి ఉండడం గమనించారు. దీంతో లోనికి వెళ్లి చూడగా కార్యాలయంలోని బీరువా తెరచి ఉంది.
సిబ్బంది కార్యాలయ మేనేజర్ శాస్త్రికి సమాచారం అందించారు. ఆయన వెంటనే కార్యాలయానికి చేరుకుని పరిశీలించగా ల్యాప్‌టాప్, బీరువాలో ఉండవలసిన రూ.5 లక్షల నగదు కనిపించలేదు. దీంతో ఆయన పటమట పోలీసులకు సమాచారం అందించారు. ఏడీసీపీ రామకోటేశ్వరరావు, ఏఎస్‌ఐ శేషారెడ్డి, క్లూస్‌టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని సిబ్బంది వద్ద నుంచి వివరాలు సేకరించారు.
క్లూస్‌టీమ్ వేలిముద్రలు సేకరించారు. కార్యాలయంలో సీసీ కెమెరాలు అమర్చి ఉండడంతో పోలీసులు సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కార్యాలయం ఎంపీ రాయపాటి సాంబశివరావుది కాదని, రియల్ ఎస్టేట్ వ్యాపారిదని, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు మాత్రమే జరుగుతాయని సిబ్బంది చెబుతున్నారు.