రోజూ చంపేస్తున్నారు | roja murder case mystery special story | Sakshi
Sakshi News home page

రోజూ చంపేస్తున్నారు

Published Wed, Sep 6 2017 12:48 PM | Last Updated on Fri, Aug 10 2018 8:30 PM

తన పూరింటి వద్ద రోజా తల్లి అచ్చియ్యమ్మ , మృతురాలు రోజా(ఫైల్‌) - Sakshi

తన పూరింటి వద్ద రోజా తల్లి అచ్చియ్యమ్మ , మృతురాలు రోజా(ఫైల్‌)

రోజా మృతి కేసులో రోజూ బెదిరింపులే
ప్రేమిస్తున్నానని వెంటపడి.. పెళ్లంటే కుదరదన్న సంతోష్‌
మరో యువకుడిని వివాహమాడినా వదలని వైనం
ఊరందరి ముందే ఆమెను వెంటాడి వేధించిన ప్రబుద్ధుడు
ఆనక హత్యాచారం చేశారంటున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు
నిందితులకు టీడీపీ నేత, భీమిలి మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ అండ
దారుణ ఘటనపై కనీస మాత్రంగా స్పందించని రెవెన్యూ, పోలీసు అధికారులు
పైగా ఆత్మహత్యగా కేసు నమోదు.. సాక్ష్యాలు తారుమారు
అదేమని రోజా తల్లిదండ్రులు  ప్రశ్నిస్తే మీకు పిచ్చెక్కిందంటన్న గబ్బర్‌ సింగ్‌ సీఐ
రోజా అక్క చెల్లెళ్లకు నిత్యం బెదిరింపులు
మంత్రి గంటా ఇలాకాలో రెండు నెలలుగా దాష్టీకం


ప్రేమించానని వెంటపడ్డాడు..
పెళ్లి మాటెత్తేసరికి కులం సాకు చూపి జారుకున్నాడు..
ఛీకొట్టిన ఆ యువతి తల్లిదండ్రులు చూసిన యువకుడితో మూడుముళ్లు వేయించుకుని వెళ్లిపోయింది..
ఆషాడమాసంలో పుట్టింటికొచ్చిన ఆమెను మళ్లీ వెంటపడ్డాడు. ఊరందరి ముందే వేధించాడు.. అడ్డుకోబోయిన ఆమెనూ కొట్టాడు..
అంతే.. ఆ రాత్రే అదృశ్యమైన ఆ యువతి..
మరునాడు ఊరి చివర బావిలో నిలువెల్లా గాయాలతో విగతజీవిగా కనిపించింది..
ఆ అమాయకురాలి మానప్రాణాలను ప్రేమ పేరుతో వేధించిన యువకుడు, అతగాడి మిత్రబృందమే బలిగొందని ఊరు ఊరంతా ఘోషించింది.. ఆందోళన బాట పట్టింది.. న్యాయం కోసం డిమాండ్‌ చేసింది. ఇంతలో అధికార టీడీపీ నేత రంగ్రప్రవేశం చేశాడు..
పెద్దమనిషి ముసుగులో నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకున్నాడు.. అంతే పోలీసులూ ఆయనకు వంతపాడారు..
మృతురాలిది ఆత్మహత్యగా తేల్చేశారు.. యువకుడిపై ఆత్మహత్యకు ప్రేరేపించనట్లు కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు.
ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తున్నవారిని ఆ ప్రాంత పోలీసు అధికారి పిచ్చివాళ్ల కింద జమకడుతున్నాడు..
మరోవైపు ఆందోళన చేపట్టిన మృతురాలి అక్కాచెల్లెళ్లను, బంధువులను టీడీపీ నేత అనుచరులు బహిరంగంగానే బెదిరిస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు..మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం మండలం అనంతవరం గ్రామంలో దాదాపు రెండు నెలలుగా సాగుతున్న ఈ దమనకాండపై సాక్షి ఎక్స్‌క్లూజివ్‌ రిపోర్ట్‌...


నిందితులకు టీడీపీ నేత గొర్రెపాటి అండ?
అనంతవరానికి చెందిన తెలుగుదేశం నాయకుడు, భీమిలి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి పెద ఎర్రినాయుడు నిందితుల తరఫున రంగంలోకి దిగి కేసు నిర్వీర్యం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. జూలై 11న ఘటనాస్థలికి వచ్చిన ఎర్రినాయుడు విచారణ చేపట్టిన పోలీసులతో అక్కడే మంతనాలు జరిపాడని రోజా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అప్పటివరకు మీకు న్యాయం చేస్తామని చెప్పుకొచ్చిన పోలీసుల తీరు ఆ తర్వాతే మారిపోయిందని చెబుతున్నారు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సరిగ్గా పదేళ్ల కిందట రాష్ట్రాన్ని ఓ కుదిపేసిన ఆయేషా మీరా హత్య కేసును తలపిస్తున్న రోజా అనుమానాస్పద మృతి కేసుపై అధికారుల విచారణ తీరు కూడా అనుమానాలకే తావిస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన ఓ యువతిని అత్యాచారం చేసి.. పాశవికంగా హత్య చేశారని తల్లిదండ్రులు ఘోషిస్తున్నా ఏ మాత్రం లెక్క చేయని అధికారుల నిర్వాకం, తిరిగి బాధితులపైనే బెదిరింపులకు దిగుతున్న వైనం వివాదాస్పదమవుతోంది .

అసలేం జరిగిందంటే..
పద్మనాభం మండలం అనంతవరం గ్రామానికి చెందిన కొండమాని శివన్నారాయణ, అచ్చియ్యమ్మలకు ముగ్గురు కుమార్తెలు. గీత కార్మికుడైన శివన్నారాయణ రోజూ కూలి పనికి వెళ్తే గానీ ఇల్లు గడవని పరిస్థితి. అతని రెండో కుమార్తె రోజాను అదే గ్రామానికి చెందిన ముత్తుపాటి సంతోష్‌ ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లిచేసుకోమనే సరికి మీది మా కంటే తక్కువ స్థాయి... కుదరదన్నాడు. కావాలంటే వివాహేతర సంబంధంతో కొనసాగిద్దామన్నాడు. హతాశురాలైన ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన యువకుడితో వివాహం చేసుకుంది. విజయనగరం జిల్లా ఎల్‌.కోట మండలం లక్ష్మీపేట గ్రామానికి చెందిన బాడితబోని ఈశ్వరరావుతో జూన్‌ 3న పెళ్లి జరిగింది.

పెళ్లి సమయంలో కూడా సంతోష్‌ వచ్చి నానాయాగీ చేయడంతో ఆమె తల్లిదండ్రులు గ్రామపెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో గొడవ అప్పటికి సద్దుమణిగింది. ఆషాఢ మాసం కావడంతో జూన్‌ 16న రోజా కన్నవారింటికి వచ్చింది. దాంతో సంతోష్‌ మళ్లీ ఆమె వెంటపడ్డాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి ఆమెను అడ్డుకుని ‘నీతో మాట్లాడాలి.. తనతో రమ్మంటూ’ వేధించేవాడు. ‘నాకు పెళ్లయింది.. నన్ను వదిలేయ్‌’.. అంటూ ఓసారి గట్టిగా మాట్లాడిన రోజాపై అందరూ చూస్తుండగానే చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న గ్రామస్తురాలు కొప్పు నాగమణి అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత జూలై 9న సాయంత్రం 4 గంటలకు  రోజా చేయిపట్టుకొని బలవంతంగా లాక్కొని వెళ్లిపోతుంటే ఆమె కేకలు వేసింది. దీంతో దగ్గరలో ఉన్న ఆమె చెల్లెలు కృష్ణమ్మ పరిగెత్తుకొని వచ్చి సంతోష్‌ను విసురుగా తోసివేసి రోజాను తీసుకొని వెళ్లింది.

అదే రోజు రాత్రి ఇంటి నుంచి మాయమైన రోజా 11వ తేదీన ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధారకొండ అటవీ ప్రాంతంలోని నేలబావిలో శవమై తేలింది. సంతోషే చంపేశాడని ఊరంతా గగ్గోలు పెట్టింది. కన్నవారి కడుపుకోత, అయినవాళ్ల రోదనలు రెవెన్యూ, పోలీసు అధికారులకు తప్ప అందరి గుండెల్ని తాకాయి. తమ బిడ్డను ఘోరంగా హత్య చేశారని ముక్తకంఠంతో ఘోషిస్తున్నా విచారణ కొచ్చిన తహసీల్దార్‌ సుమతీబాయి మాత్రం రోజాది ఆత్మహత్యేనని పంచనామాలో రాసి వెళ్లి పోయారు. ఇక పోలీసులు.. పోస్టుమార్టం తంతు ముగించి మృతదేహాన్ని ఇచ్చి మీ అమ్మాయి తనంతట తానే నుయ్యిలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఇందులో ఎవరి ప్రమేయం లేదని తేల్చేశారు. రోజా తల్లిదండ్రులు, గ్రామస్తులు, ప్రగతిశీల మహిళా సంఘం, కల్లుగీత కార్మిక సమాఖ్య, దళిత విముక్తి, ప్రజాసంఘాలు రోజులతరబడి నిరవధిక ఆందోళన చేపట్టడంతో ఎట్టకేలకు ఆత్మహత్యాప్రేరేపిత నేరంగా మార్చి సంతోష్‌పై కేసు నమోదు చేశారు.

మా అమ్మాయిని రేప్‌ చేసి.. చంపేశారు
9వ తేదీ రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న రోజాను సంతోష్, అతని స్నేహితులు బలవంతంగా ఎత్తుకెళ్లి స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్ద అత్యాచారానికి పాల్పడ్డారు. ముత్తుపాటి సంతోష్‌తో పాటు అదే గ్రామానికి చెందిన వంక సంతోష్, వంగలి దుర్గ, రాలి ఉమామహేశ్వర్, కశిరెడ్డి కిరణ్, చొప్పమురళి, తమరాడ వెంకటరావులు ఈ దారుణానికి పాల్పడ్డారని రోజా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు.. కానీ రోజా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. సంతోష్‌ మోసం చేశాడని గ్రహించి మేం కుదిర్చిన పెళ్లి చేసుకుంది.. ఒకవేళ పెళ్లి ఇష్టం లేకుంటే అప్పడే చెప్పేది..పెళ్లయిన తర్వాత ఎందుకు బలవంతంగా ప్రాణం తీసుకుంటుంది.. అది కూడా అర్ధరాత్రి ఇంటి నుంచి ఒంటరిగా అడవికి వెళ్లి నుయ్యులో దూకి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుందన్న వారి ప్రశ్నలకు మాత్రం అధికారులు  సమాధానం చెప్పడం లేదు.

అవి సాక్ష్యాలే కావంటున్న ఖాకీలు
ఇక పోలీసుల తీరు కూడా అలాగే ఉంది. రోజా శవమై తేలిన నేలనుయ్యికి దగ్గర్లో మందు బాటిళ్లు, చికెన్‌ మసాలా ప్యాకెట్లు కనిపించాయి. రోజా హత్యకు గురైన జూలై 9 రాత్రి సంతోష్‌ చికెన్‌ పట్టుకొని వెళ్లాడు.. నా టూవీలర్‌ బండి ఇచ్చానని అక్కడ చికెన్‌ షాపులో పనిచేసే యువకుడు  చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. కనీసం వాటిని  సీజ్‌ చేయలేదు. ఇటీవల తరచూ కురిసిన వర్షాలకు సాక్ష్యాలు వాటంతట అవే మాయమై పోయేవరకు  ఎదురుచూశారు. అలాగే గుండు చేయించుకున్న సంతోష్‌ తలపై పెట్టుకునే టోపీ అదే బావిలో దొరికినా.. అబ్బే... అది సాక్ష్యమే కాదని ఖాకీలు కొట్టిపారేశారంటే విచారణ ఏరీతిన చేపట్టారో అర్ధమవుతుంది. పైగా పోలీసులు ఏం చెబుతున్నారంటే... సంతోష్‌ను పెళ్లి చేసుకోమని రోజా ఒత్తిడి చేసింది.. అతను నిరాకరించడంతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పుకొస్తున్నారు.

కుటుంబసభ్యులకు రోజూ  బెదిరింపులే
రోజా మృతిపై విచారణ చేపట్టాలని పీవోడబ్ల్యూతో సహా ప్రజాసంఘాలు ఉద్యమం ఉధృతం చేసిన నేపథ్యంలో రోజా అక్క భారతి, చెల్లెలు కృష్ణమ్మలకు ఊళ్లో వేధింపులు ఎక్కువయ్యాయి. రెండురోజుల కిందట సోమవారం గ్రామస్తులు వందలాదిగా తరలివచ్చి విశాఖలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో సోమవారం సాయంత్రం కూరగాయల షాపునకు వెళ్లిన భారతిని నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకున్న  కసిరెడ్డి అప్పారావు అలియాస్‌ చందర్‌రావు అప్పారావు బెదిరించాడు. మీరంతా కలిసి ఏమీ చేయలేరు.. కొన్నాళ్లు ఆగండి మా దొడ్లలో ఎలా తిరుగుతారో చూస్తాం.. మీ సంగతి తేలుస్తామని గద్దించాడు. ఇక వారం కిందట వంకా అప్పలరాజు అనే అతను రోజా చెల్లెలు కృష్ణమ్మపై ఏకంగా కత్తి పెట్టి బెదిరించాడు. దీనిపై వెంటనే  సీఐ కృష్ణమోహన్‌ అలి యాస్‌ గబ్బర్‌సింగ్‌ దృష్టికి తీసుకువెళ్తే.. మీరే నోరు అదుపులో పెట్టుకుని  జాగ్రత్తగా ఉండాలమ్మా అని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.

ఇప్పటివరకు  స్పందించని మంత్రి  గంటా
భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం మండలం అనంతవరం గ్రామంలో ఇంత దారుణం జరిగినా.. సుమారు 55రోజులుగా బాధితులు నిత్యం ఆందోళనలు చేస్తున్నా ఆ సెగ్మెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంతవరకు స్పందించకపోవడం విమర్శల పాలవుతోంది. పైగా టీడీపీ నేత, భీమిలి వ్యవసాయ మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ గొర్రిపాటి ఎర్రినాయుడు నిందితులకు అండగా ఉన్నారన్న వాదనలు వెల్లువెత్తుతున్నా మంత్రి పట్టించుకోకపోవడం చర్చాంశనీయంగా మారింది.


విచారణలో అన్నీ అవకతవకలే...
నెలన్నరగా సెలవులోనే తహసీల్దార్‌

తమ కుమార్తెను పాశవికంగా అత్యాచారం చేసి హత్యచేశారని తల్లిదండ్రులు మొత్తుకుంటున్నా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కనీసం ఆ దిశగా విచారణ చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. శవపంచనామా విషయంలో తహసీల్దార్‌ సుమతీబాయి తీరు విమర్శల పాలైంది. పంచనామాదారులను ఎంపిక చేయకుండానే, వారికి మృతదేహం చూపించి గాయాలున్నాయా? లేదా అన్నదాననికి వారి అభిప్రాయాలు నమోదు చేయకుండానే మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించేశారు. ఆ తర్వాత  పోస్టుమార్టం అయ్యింది. మీ అమ్మాయి మృతదేహం ఇస్తాం.. ఐదుగురు సంతకాలు చేయండి అని రోజా బంధువులతో  పంచనామాదార్ల సంతకాలుగా నమోదు చేసేశారు.

వారంతా ఉమ్మడిగా ఆత్మహత్య అని ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టు తహసీల్దార్‌  నివేదిక ఇచ్చేశారు. ఓ మహిళా అధికారి అయి ఉండి కూడా తహసీల్దార్‌ అలా ఎందుకు నివేదిక ఇచ్చారన్నది ఇప్పటికీ అంతుబట్టకుండా ఉంది. పైగా ఈ ఘటన జరిగిన తర్వాత రోజు నుంచి తహసీల్దార్‌ సెలవులో వెళ్లిపోవడం అనేక అనుమానాలకు ఆస్కారం కలిగిస్తోంది. ఆ తర్వాత ప్రజాసంఘాల ఒత్తిడి మేరకు రీ పోస్టుమార్టంకు ఆదేశాలిచ్చినా అప్పటికే సాక్ష్యాలు తారుమారయ్యాయన్న వాదనలకు బలం చేకూరుతోంది.

జుడీషియల్‌ విచారణ జరిపించాలి : పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి
రోజా మృతి ఘటనపై జుడీషియల్‌ విచారణ చేపట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి డిమాండ్‌ చేశారు. ఆమెను అత్యంత పాశవికంగా బలత్కారం చేసి హత్య చేశారని ఆమె ఆరోపించారు. నిందితుల తరఫున టీడీపీ నేత, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ఎర్రినాయుడు రంగంలోకి దిగడంతోనే పోలీసులు, రెవెన్యూ అధికారులు  కేసును నిర్వీర్యం చేసేందుకు ఇప్పటికే సాక్ష్యాలను తారుమారు చేసేశారని అన్నారు. అందుకే జుడీషియల్‌ విచారణ చేపడితేగానీ అసలు దోషు అరెస్టు కారని అన్నారు.

పోలీసులు మమ్మల్నే బెదిరిస్తున్నారు: రోజా సోదరి కృష్ణమ్మ
తన సోదరి రోజాను ముత్తంపాటి సంతోష్‌తో సహా  అతని అనుచరులు ఏడుగురు కలిపి అత్యాచారం చేసి హత్య చేసి నూతిలో పడేశారు. సంతోష్‌ ను మాత్రమే అరెస్టు చేశారు. మిగతా ఆరుగురుని అరెస్టు చేయలేదు. గొర్రెపాటి పెద ఎర్రినాయుడు వీరికి కొమ్ము కాసి అరెస్టు చేయనివ్వకుండా చేస్తున్నారు. తాము చెప్పింది పోలీసులు వినడం లేదు.. పైగా మమ్మల్నే ఇబ్బంది పెడుతున్నారని కొండమాని  కృష్ణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

సమాధానం లేని ప్రశ్నలు
రోజా ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అంటున్నారు. కానీ నిజంగానే బలవన్మరణానికి పాల్పడితే అర్ధరాత్రి 2గంటల సమయంలో ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని అడవికి వెళ్లి ఎందుకు అఘాయిత్యం చేసుకుంటుంది?
నీళ్లతో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడికతే తలపై రక్త గాయాలు ఎందుకున్నాయి..  తాళి బొట్టుకి రక్తం అంటుకుని ఎలా ఉంది.. 40గంటలకు పైగా మృతదేహం బావిలో ఉన్నా... ఆమె ఒంటిపై ముద్దలు ముద్దలుగా రక్తం ఎలా అంటుకుని ఉంది.?

బాధితులపైనే గబ్బర్‌సింగ్‌ క్రౌర్యం
ఇక కేసు విచారణలో ఖాకీలు విమర్శలు ఎదుర్కొంటుండగా, పద్మనాభం సీఐ  వై కృష్ణకిషోర్‌ కుమార్‌ అలియాస్‌ గబ్బర్‌సింగ్‌ వ్యవహారశైలి మరింత వివాదాస్పదమవుతోంది. తన పేరుతో కంటే గబ్బర్‌సింగ్‌గా పిలవాలని అందరినీ కోరుకునే సదరు సీఐ  బాధితులనే బెదిరిస్తున్న వైనం ఏవగింపు కలిగిస్తోంది. పోలీస్‌ ఉన్నతాధికారులు సైతం ఎంతో మర్యాదగా వ్యవహరిస్తుంటే ఈ గబ్బర్‌సింగ్‌ మాత్రం తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో బాధితుల మీదే ఇష్టమొచ్చినట్టు మాట్లాడటడం చర్చాంశనీయంగా మారింది.  ఈ కేసు విషయమై ఏం జరిగిందని అడిగితే.. మీకు పిచ్చెక్కింది.. వాడు పెళ్లిచేసుకోనంటే మీ అమ్మాయే సూసైడ్‌ చేసుకుని చచ్చింది.. అని సీఐ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని రోజూ తల్లి చెప్పుకొచ్చారు. న్యాయం చేయాల్సిన సీఐ బెదిరింపులకు దిగితే.. తమకు ఏం న్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. -సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement