ఉచిత ఇసుక పేరుతో రూ. కోట్ల వ్యాపారం
* ఆ సొమ్ము పెదబాబు జేబులోకా?
చినబాబు జేబులోకా?
* వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మోపిదేవి వెంకటరమణారావు ధ్వజం
రేపల్లె: ఉచిత ఇసుక పేరుతో చేస్తున్న దోపిడీ సొమ్ము స్థానిక టీడీపీ నేతల జేబుల్లోకా, పెదబాబు జేబులోకా, లేక చినబాబు జేబులోకి వెళ్తున్నాయా అంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణారావు విమర్శించారు. పట్టణంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇసుకను ఉచితంగా అందిస్తున్నట్లు ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఇసుకరేవుల్లో టీడీపీ నేతలు బ్రోకర్లుగా మారి ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ట్రక్కు ఇసుకకు రూ.350 వసూలు చేయాల్సి ఉండగా రూ.800 వసూలు చేస్తూ ఇళ్లు నిర్మించుకునే పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు. పెనుమూడి రేవు నుంచి రోజుకు వందల ట్రక్కుల ఇసుకను తరలిస్తూ కోట్లాది రూపాయాలు దోచుకున్నారని ఆరోపించారు. కళ్ల ముందే కోటాది రూపాయలు దోచుకుంటుంటే రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ అధికారులు ధృతరాష్ట్రుని పాత్ర పోషించటం దురదృష్టకరమన్నారు. నిలువుదోపిడీకి గురౌతున్న ప్రజలు తిరగబడక ముందే టీడీపీ నేతలు ఇసుక అవినీతికి స్వస్తి పలకాలని హితవు పలికారు.