♦ కరువును ఎదుర్కొనేందుకు కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్న సర్కారు
♦ సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం.. తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు
♦ ఢిల్లీకి వెళ్లిన మహమూద్ అలీ, కడియం, పోచారం, హరీశ్‌రావు
♦ నేడు కేంద్ర వ్యవసాయ మంత్రితో భేటీ.. ప్రధానిని కలిసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కమ్ముకున్న దుర్భర కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూ. 2,500 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. అందులో తక్షణ సాయంగా రూ.1,000 కోట్లను వెంటనే మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయనుంది. దీనిపై ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించనుంది. తాగునీరు, పశుగ్రాసం, పంటల పెట్టుబడి రాయితీ అవసరాల దృష్ట్యా తగిన సాయం అందించాలని కోరనుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లారు. ఈ మంత్రుల బృందం బుధవారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్‌సింగ్‌ను కలసి ఆర్థిక సాయం కోసం విజ్ఞప్తి చేయనుంది. తక్షణ సాయంగా రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరనుంది. అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు వారు ప్రధాని అపాయింట్‌మెంట్ కోరారు.
సమగ్ర వివరాలతో నివేదిక..
రాష్ట్ర ప్రభుత్వం 231 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జిల్లాల పరిస్థితిపై అందిన నివేదికలతో ప్రభుత్వం సమగ్ర నివేదిక రూపొందించింది. దీన్ని కేంద్రానికి అందించనుంది. తక్షణ సాయం అందించడంతో పాటు రాష్ట్ర కరువు తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని మంత్రుల బృందం కోరనుంది.
కరువుపై మంత్రుల ఉపసంఘం
రాష్ట్రంలో కరువు పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం మంగళవారం మంత్రు ల ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘానికి చైర్మన్‌గా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వ్యవహరిస్తారు. మరో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, కేటీఆర్, హరీశ్‌రావు సభ్యులుగా ఉంటారు. వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
రూ. 2,500 కోట్లు ఇవ్వండి
Published Wed, Dec 2 2015 3:11 AM | Last Updated on Sun, Sep 3 2017 1:19 PM
Advertisement