ఖాతాదారులందరికీ రూపేకార్డులు
- కేడీసీసీబీ ద్వారా 1.05 లక్షల కార్డులు పంపిణీ లక్ష్యం
- 1997కు ముందు రుణ బకాయిదారులకు వన్‌లైమ్ సెటిల్‌మెంట్
- జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మన్ వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్): నగదురహిత లావాదేవీల నిర్వహణకు వీలుగా జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఖాతాదారులకు రూపే కార్డులు పంపిణీ చేస్తున్నట్లు చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. జిల్లాలో 1.05 లక్షల రూపే కార్డులు పంపిణీ చేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 10వేల కార్డులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ... రూపే కార్డులు పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. రైతులు, ఇతర ఖాతాదారులు సంబంధిత బ్రాంచీల ద్వారా వీటిని పొందవచ్చన్నారు.
2016-17లో రూ.20 కోట్ల కొత్త పంట రుణాలు, రూ. 120 కోట్ల దీర్ఘకాలిక రుణాలు పంపిణీ చేసినట్లు పంపిణీ చేసినట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాల రికవరీ 50శాతం పైగా ఉందని చెప్పిన చైర్మన్ నెలాఖరులోగా 70శాతానికి చేరుతుందన్నారు. నెలాఖరులోగా రుణాలు చెల్లిస్తే అపరాద వడ్డీ ఏమీ ఉండదని చెప్పిన చైర్మన్ గడువులోగా రుణాలు చెల్లించాలని రైతులకు సూచించారు. 1997వ సంవత్సరానికి ముందు రుణాలు తీసుకొని ఇప్పటి వరకు చెల్లించని వారికోసం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అసలుకు సమానంగా వడ్డీ చెల్లిస్తే పూర్తిగా మాఫీ చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్యాంకు నిరర్థక ఆస్తులను గణనీయంగా తగ్గించి బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు.