సాగర్‌పై సస్పెన్షన్ వేటు!
సాగర్‌పై సస్పెన్షన్ వేటు!
Published Sun, Mar 5 2017 1:09 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏలూరు డెప్యూటీ తహసీల్దార్ ఎల్.విద్యాసాగర్‌పై సస్పెన్షన్ వేటు పడినట్టు సమాచారం. ఇటీవల కలెక్టర్, రెవెన్యూ అసోసియేషన్ మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో తాజా వ్యవహారం చర్చనీయాంశమైంది. డెప్యూటీ తహసీల్దార్ హోదాలో విద్యాసాగర్ తమను వేధిస్తున్నారంటూ రేషన్ డిపో డీలర్లు కలెక్టర్ కె.భాస్కర్‌కు శనివారం ఫిర్యాదు చేయడంతో ఆయనను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. ‘విద్యాసాగర్ మమ్మల్ని ఏమేయ్.. ఒసేయ్ అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఐదు కిలోల బియ్యం తగ్గినా వేధిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే డిపోకు తాళం వేస్తానని బెదిరిస్తున్నారు’ అంటూ రేషన్ డీలర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఏలూరు ఆర్డీఓకు ఆదేశాలిచ్చారు.
తిట్లు.. వేధింపులు భరించలేకపోతున్నామని ఫిర్యాదు
ఏలూరు మండలానికి చెందిన రేషన్ డీలర్లు, గుమాస్తాలు విద్యాసాగర్ పెట్టే బాధలు భరించలేకపోతున్నామని కలెక్టర్ ఎదుట వాపోయారు. తమ తల్లిదండ్రులను సైతం చెప్పుకోలేని విధంగా తిడుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రతి నెలా ఒక్కొక్క రేషన్ డిపో నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తున్నారని, లంచం ఇవ్వకపోతే డిపోకు తాళాలు వేస్తామని బెదిరిస్తూ బండబూతులు తిడుతున్నారని వారు ఆరోపించారు. గర్బిణి అని కూడా చూడకుండా తనను నోటికి వచ్చినట్టు దూషించి.. 10 కేజీల బియ్యం ఎందుకు తగ్గాయని నిలదీశారని ఈపిచర్ల గంగ అనే డీలర్ వాపోయారు. బస్తాను ఎలుకలు కొరికివేయడం వల్ల బియ్యం కారిపోయి కింద పడ్డాయని, వాటిని పక్కకు తీసి ఉంచానని, వెనక్కి పంపిద్దామనే ఉద్దేశంతో పంపిణీ చేయకుండా డిపోలోనే ఉంచేసినట్టు చెప్పినా వినకుండా కేసు రాస్తే డిపో రద్దవుతుందని అంటూ బెది రించారని ఆమె ఆరోపించింది. డిపో రద్దయితే జీవనోపాధి పోతుందనే భయంతో రూ.5 వేలను సాగర్‌కు లంచంగా ఇచ్చామని, రెండు రోజుల తరువాత మళ్లీ వచ్చి డిపో రికార్డుల తనిఖీ అంటూ వేధిస్తున్నారని ఆరోపించారు. ‘చంద్రబాబైనా, జిల్లా కలెక్టరైనా నాకు గొప్పకాదు. నేను చెప్పినంత డబ్బు ఇవ్వకపోతే ఏదో పేరుతో డిపోను రద్దు చేయిస్తానని భయపెడుతున్నారు’ అని డీలర్లు ఎస్.సత్యవతి, ఆర్.విమలాదేవి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు, ప్రసాద్, శ్రీరేఖ తదితరులు కలెక్టర్‌కు వివరించారు. తన తల్లి కోడూరు పార్వతి పక్షవాతంతో బాధపడుతోందని, సహాయం గా తాను డిపోలో పనిచేస్తుంటే సాగర్ వచ్చి బినామీ పేరుతో డిపో నడుపుతున్నావంటూ తన తల్లిని బెదిరించారని, కేసు లేకుండా చేయాలంటే రూ.5 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని డీలర్ కుమార్తె రమాదేవి వాపోయింది. గతంలో కూడా చెప్పడానికి వీలులేని దుర్భాషలాడుతూ.. లంచాలు ఇవ్వకపోతే డిపోకు తాళం వేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని పలువురు డీలర్లు చెప్పారు. కలెక్టర్ స్పందిస్తూ ఎవరికీ, ఏ ఒక్కరూ లంచం ఇవ్వాల్సిన పనిలేదని, ఎవరైనా లంచం అడిగితే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. రేషన్ డిపోల్లో గతంలో అక్రమాలు జరిగేవని, ఈ–పాస్ విధానం అమల్లోకి రావడంతో ఆ పరిస్థితి లేదన్నారు. డీలర్లు ఎవరికీ బయపడాల్సిన పనిలేదని, ఎవరైనా బెదిరిస్తే తన దృష్టికి తీసుకు వస్తే అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించిన కలెక్టర్ ఏలూరు ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించారు. తక్షణమే నివేదిక సమర్పించాలని కోరారు. ఇదిలావుంటే.. రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో విద్యాసాగర్ ఇటీవల కలెక్టర్‌కు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. వర్క్ టు రూల్ పాటిస్తామని ప్రకటించడంతోపాటు కలెక్టర్‌పై ఆరోపణ లు చేశారు. వాటిని కలెక్టర్ తిప్పికొట్టగా, ఆ తర్వాత తహసీల్దార్ల ఒత్తిడితో వర్క్ టు రూల్ చేస్తామన్న అల్టిమేటమ్ నుంచి విద్యాసాగర్ వెనక్కి వెళ్లారు. ఈ నేపథ్యంలో సాగర్‌పై ఒకేసారి డీలర్లంతా వచ్చి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
Advertisement