- ఇరిగేషన్ ఎస్‌ఈ రాంబాబు
- వర్షాభావ పరిస్థితుల వల్లే నీటి ఎద్దడి
- పీబీసీ, ఏలేరు పరిధిలో ఇంకా 10వేల ఎకరాల్లో పూర్తి కానినాట్లు
- పదిరోజుల్లో సమస్యను అధిగమిస్తామని హామీ
- ఏలేరు, పీబీసీ ద్వారా 950 క్యూసెక్కులు నీటి విడుదల
కష్టాల్లో ఖరీఫ్ నిజమే
Published Sun, Aug 21 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
గొల్లప్రోలు :
నెల రోజులుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని ఇరిగేషన్ ఎస్‌ఈ బి.రాంబాబు తెలిపారు. జిల్లాలో నెలకొన్న నీటి ఎద్దడి పరిస్థితుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఎండిపోతున్న పంటలపై సాక్షిలో ‘కష్టాల్లో ఖరీఫ్’ శీర్షికన వెలువడిన కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో నీటి ఎద్దడిని పరిశీలించారు. ఎస్‌ఈ నేతృత్వంలో అధికారులు, నీటిసంఘం ప్రతినిధుల బృందం పీబీసీ, ఏలేరు పరిధిలోని సామర్లకోట నుంచి తొండంగి మండలం కోదాడ వరకు ఉన్న ఆయకట్టు ప్రాంతాల్లో ఆదివారం పర్యటించి అక్కడి పరిస్థితులను స్థానిక అధికారులు, నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం ఆర్‌ఆర్‌బీ ట్యాంకును పరిశీలించి పూర్తిగా అడుగంటిపోవడాన్ని ఆయన గుర్తించారు. శిథిలావస్థలో ఉన్న 14 స్లూయిస్‌లను, షట్టర్లును పూర్తి స్థాయిలో మరమత్తులు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధవళేశ్వరం నుంచి సామర్లకోట వరకు వచ్చే నీటిని పీబీసీ ద్వారా 500 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. మరో 50క్యూసెక్కులు అదనంగా విడుదల చే స్తామన్నారు. అలాగే ఏలేరు నుంచి 400 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఏలేరు, పీబీసీ పరిధిలోని 53వేల ఎకరాలకు 43వేల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయని, ఇంకా పది నుంచి 11వేల ఎకరాల్లో నాట్లు వేయాల్సి ఉందన్నారు. పది రోజుల్లో పూర్తి స్థాయిలో నీటి ఎద్దడిని నివారిస్తామన్నారు. ఏలేరు, గోదావరి అనుసంధానానికి రూ1650కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఆమోదం తెలిపారన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి అనుసంధానం ప్రక్రియపూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇరిగేషన్ ఈఈలు పి అప్పలరాజు, ఎస్ జగదీశ్వరరావు, కృష్ణారావు, డీఈ శేషగిరిరావు, ఏఈలు రెహమాన్, అప్పారావు, నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ యనమల నాగేశ్వరరావు, మాజీ చైర్మన్ యనమల రామారావు, నీటి సంఘం అధ్యక్షుడు వింజరపు కొండ, మాజీ అధ్యక్షుడు కడిమిశెట్టి కుమార భాస్కరరెడ్డి, పాలపర్తి చలమయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement