గ్రామాల్లో నివాసం లేకుంటే జీతం కట్
Published Sat, Sep 10 2016 1:07 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
ఏలూరు సిటీ : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు అదే గ్రామాల్లో నివాసం లేకుంటే జీతాలు నిలుపుదల చేస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శి పనిచేసే వివరాల సమాచార బోర్డుల ఏర్పాటుపై శుక్రవారం సమీక్షించారు. నల్లజర్ల మండలంలో పలువురు కార్యదర్శులు పనిచేసే గ్రామంలో కాకుండా ఏలూరులో కాపురం ఉంటున్నారని ఈవోఆర్డీ చిన్నారావు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ కార్యదర్శులు రోజువారీ డ్యూటీ వివరాలు, ఫోన్ నంబర్, నివాసం ఎక్కడ ఉంటున్నారో వివరాలను తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని గతంలో ఆదేశించానని, మెజారిటీ పంచాయతీల్లో అమలు కావడం లేదని కార్యదర్శులపై మండిపడ్డారు. ఏలూరు డీఎల్‌పీవో వ్యవహార శైలి మార్చుకోవాలని కలెక్టర్ హెచ్చరించారు. పంచాయతీల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీకి చర్యలు తీసుకోవాలని ఈవోపీఆర్డీలను కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు.
ప్రజాసాధికార సర్వేలో అగ్రస్థానం
ప్రజాసాధికార సర్వే కార్యక్రమం అమల్లో పశ్చిమ 90 శాతం సర్వే పూర్తి చేయగలిగిందని, ఏజెన్సీ ఏరియాలో టవర్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల మిగిలిన 10 శాతం జాప్యం జరుగుతోందని, త్వరలోనే నూరు శాతం సర్వే పూర్తి చేసిన జిల్లాగా అగ్రస్థానంలో నిలుస్తుందని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో డీపీవో కె.సుధాకర్, డివిజనల్ పంచాయతీ అధికారి పాల్గొన్నారు.
నెలాఖరుకు పనులు పూర్తికావాలి
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా పురోగతిలో ఉన్న పనులన్నీ కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎంపీ లాడ్స్ ద్వారా ఖర్చు పెట్టే నిధులుపై పనుల ప్రగతిని ఆయన సమీక్షించారు. పనులు ఈ నెలాఖరుకు పూర్తికాకపోతే సంబంధిత ఏఈ, ఎంపీడీవోలపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దత్తత గ్రామాలు తూర్పుతాళ్లు, పెదమైనివానిలంక, మహాదేవపట్నం, సంజీవపురం, పెదకాపవరం, పేరుపాలెం సౌత్, కె.రామవరంలలో కొత్తగా 433 పింఛన్లు మంజూరు చేశామన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సీహెచ్ అమరేశ్వరరావు, హౌసింగ్ పీడీ ఈ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement