
మోహన్‌బాబు నాకు పరోక్ష గురువు
- బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు
- ‘సాక్షి’తో మాటామంతీ
మచిలీపట్నం : ‘చిన్నప్పటి నుంచి సినిమాలంటే అత్యంత ఇష్టం. మోహన్‌బాబు సుదీర్ఘంగా చెప్పే డైలాగులను పదే పదే వల్లెవేసే వాడిని. పెద్ద పెద్ద డైలాగులు చెప్పటంలో ఆయనే నాకు పరోక్ష గురువు. డ్రస్సుల విషయంలో ఉపేంద్ర శైలిని ఫాలో అయ్యే వాడిని’- అని బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు అన్నారు. వినాయకచవితి వేడుకల్లో పాల్గొనేందుకు మచిలీపట్నం వచ్చిన ఆయన కొద్దిసేపు ‘సాక్షి’తో ముచ్చటించారు. సిద్దిపేట మెట్టపల్లి తన స్వగ్రామమని చెప్పారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇలా సాగింది....
సాక్షి : సినిమాల పట్ల ఆసక్తి ఎలాపెరిగింది?
సంపూర్ణేష్ : సినిమాలంటే చిన్ననాటి నుంచి ఇష్టం. మోహన్‌బాబుకు వీరాభిమానిని. ఆయన డైలాగులను బట్టీపట్టి నాలో నేనే చెప్పుకునే వాడిని. నటన పట్ల ఆసక్తి ఉండటంతో సినిమా రంగం వైపు మళ్లాను. కృష్ణవంశీ దర్శకత్వంలో మహాత్మా సినిమాలో చిన్నపాత్రలో నటించాను.
సాక్షి : హృదయకాలేయం సినిమా హిట్ అవుతుందని ఊహించారా ?
సంపూర్ణేష్ : హృదయకాలేయం సినిమా తీసే సమయ ుంలో అందరు నన్ను తిట్టారు. ఈ సినిమా తీస్తున్నావు... రిలీజ్ అవుతుందా, రిలీజ్ అయినా ఆడుతుందా అన్నారు. సినిమా విడుదలయ్యాక ఇంతగా ప్రజలు ఆదరిస్తారని కలలో కూడా ఊహించలేదు. సినిమా రిలీజ్ ముందు ప్రచారానికి డబ్బులు లేకపోవటంతో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నాం.
సాక్షి : ఒక్క సినిమాతోనే స్టార్ ఇమేజ్ వస్తుందని ఊహించారా ?
సంపూర్ణేష్ : ప్రతి ఒక్కరు కలలు కంటారు. నేను సినిమాలో హీరోగా చేస్తున్నానంటే కొందరు నమ్మలేకపోయారు. సినిమా రంగంలో నిలబడాలనేది నా కోరిక. ఎదిగేందుకు కొంత కృషి తోడైతే అనుకున్నది సాధించవచ్చు అనడానికి నేనే ఉదాహరణ.
సాక్షి : మీ రాబోయే సినిమాలు ?
సంపూర్ణేష్ : కొబ్బరిమట్ట, వైరస్ సినిమాల నిర్మాణం పూర్తయింది. త్వరలో ఈ సినిమాలు రిలీజ్ అవుతాయి. మోహన్‌బాబుకు ఉన్న లక్షలాది అభిమానుల్లో నేను ఒకడిని. నేను ఆయన బ్యానర్‌లోనే ‘సింగం 123’ సినిమా చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను.
సాక్షి : సినిమా రంగంలో మీకు ప్రోత్సాహం ఎలా ఉంది. ?
సంపూర్ణేష్ : నాకు సినిమాల పట్ల అభిమానం ఉంది. హీరో అవుతానని అనుకోలేదు. హృదయకాలేయం సినిమా డెరైక్టర్ స్టీవెన్ శంకర్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన చొరవ లేకపోతే సంపూర్ణేష్‌బాబు లేడు. సినిమా రంగంలో టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు అధికంగానే ఉన్నాయి. సినిమా రంగానికి మీడియా వెన్నుదన్నుగా ఉంటోంది. అందుకు నేనే ఉదాహరణ.
సాక్షి : మచిలీపట్నం రావడం ఎలా అనిపించింది ?
సంపూర్ణేష్ : మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నన్ను ఆహ్వానించి వినాయకచవితి పూజల్లో పాల్గొనాలని కోరారు. మచిలీపట్నం మొట్టమొదటిసారిగా వచ్చాను. ఇక్కడి ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు.