రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
Published Mon, Aug 22 2016 5:20 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
అధికారులు పుష్కరాల్లో బిజీ
ఇదే అదునుగా చిర్రావూరులో అక్రమ తవ్వకాలు
చిర్రావూరు (తాడేపల్లి రూరల్) : అధికారులు జిల్లా వ్యాప్తంగా పుష్కర హడావుడిలో ఉంటే ఇసుక మాఫియా చిర్రావూరులో ఆదివారం తిష్ట వేసి వందలాది ట్రాక్టర్ల ఇసుకను దోచేసుకున్నారు. నిషేధిత ఇసుక రీచ్ నుంచి అధికార పార్టీ నేతల అండదండలతో హద్దులు దాటి మరీ ఇసుక తవ్వకాలను నిర్వహిస్తున్నారు. గతంలో తాడేపల్లి మండలంలో ఉచిత ఇసుక అమల్లో ఉండగా కోట్లాది రూపాయలు దోచుకున్న సంగతి తెలిసిందే. అయితే, పుష్కరాల నేపథ్యంలో ఇసుక తవ్వకాలను నిషేధించారు. ఈ నేపథ్యంలో ఇసుక కొరత ఏర్పడడంతో దాన్ని సొమ్ము చేసుకునేందుకు తెల్లవారుజామున 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 150 ట్రాక్టర్లు ఇసుక తవ్వకాలు నిర్వహించారు. పది కిలోమీటర్ల వ్యవధిలో రెండు యూనిట్లు రూ.1,500 లకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. అది కూడా ప్రాతూరు, గుండిమెడ, చిర్రావూరు రీచ్‌లలో ఇసుక లేకపోవడంతో కృష్ణా జిల్లా పరిధిలోకి వెళ్లి మరీ ఈ తవ్వకాలు నిర్వహించడం గమనార్హం. అధికారులు అందరూ పుష్కర విధుల్లో ఉండడం ఈ మాఫియాకు కలిసొచ్చింది.
Advertisement