మోటమర్రి ఎస్సీ కాలనీని పరిశీలిస్తున్న డ్వామా పీడీ
- నివేదిక తయారు చేయనున్న డ్వామా పీడీ జగత్ కుమార్ రెడ్డి
బోనకల్ : మండలంలోని మోటమర్రి గ్రామంలోని మున్నేరులో ఉన్న ఇసుక రేవును డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. మోటమర్రి ఇసుక రేవు నుంచి గత కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని గ్రామస్తులు జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. స్పందించిన జేసీ దివ్య.. డ్వామా పీడీని ఇసుక అక్రమ రవాణాపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మోటమర్రి ఇసుక రేవును పరిశీలించిన పీడీ మున్నేరుపై ఇసుక రేవు వద్ద రెండు లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయని, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని గ్రామస్తులు పీడీ దృష్టికి తీసుకువెళ్లారు. లిఫ్టులు ఉన్నచోట ఇసుక రీచ్‌కు అనుమతులు ఎలా ఇచ్చారని, నివేదికను జేసీకి సమర్పిస్తానని పీడీ తెలిపారు. లిఫ్టులవద్ద.. ఇసుక రీచ్ ఇవ్వడం వల్ల వాహన రాకపోకలవల్ల లక్షలాది రూపాయలతో నిర్మించిన పైప్‌లైన్లు పగిలిపోవడంతోపాటు లీకులు ఏర్పడి లిఫ్టుల కింద ఆయకట్టుసాగు ప్రశ్నార్థకమైందని గ్రామస్తులు తెలిపారు. వేలాది ట్రిప్పుల ఇసుక అక్రమ రవాణా జరిగిందని, గ్రామ పంచాయితీవారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఇసుక రీచ్‌పై వచ్చిన నిధులను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదుచేశారు. కూపన్లను సొంతంగా తయారు చేయించి ఇసుక అక్రమ రవాణాకు పంచాయితీ కార్యదర్శి సంతకం లేకుండానే కూపన్లు ఇచ్చారని తెలిపారు. అనంతరం బయ్యారం–మోటమర్రి రోడ్డును పరిశీలించారు. ఎస్సీ కాలనీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, హరితహారం కింద గ్రామ పంచాయితీ మొక్కలు వేయకుండా తమపట్ల వివక్షత చూపారని కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. హరితహారం కింద మొక్కలు ఎందుకు నాటలేదో సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుని జేసీకి నివేదిక అందజేస్తానని, రెండు రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు.