- ధూళిపాళ మహాదేవమణి
- ఘనంగా ద్విగుణిత అష్టావధానం
సరస్వతీ సమర్చనే అవధానం
Published Sun, Oct 16 2016 9:45 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM
రాజమహేంద్రవరం కల్చరల్ :
చదువుల తల్లి వాణిని కనుల ముందు ఆవిష్కరించే సరస్వతీ సమర్చనే అవధానమని పద్యకళాతపస్వి డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి అన్నారు. జనభావన, విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పీఠంలో అవధాని తాతా శ్రీనివాస రమా సత్యసందీప్ నిర్వహించిన ద్విగుణిత అష్టావధానంలో మహాదేవమణి అవధాన సంచాలకునిగా వ్యవహరించి ప్రసంగించారు.
అలరించిన అష్టావధానం
శతావధానాలు, ద్విశతాధానాలు చేసిన ఉద్దండప్రతిభావంతులు సంధించిన సాహితీ, అస్తశస్త్రాలను నూనూగు మీసాల సందీప్ సమర్థంగా ఎదుర్కొన్నారు. నిషిద్ధాక్షరి పద్మవ్యూహాలను లాఘవంగా దాటుతూ, ఛందోనియమాలను పాటిస్తూ, యతిప్రాసల లెక్కలను కట్టుతప్పకుండా ద్విగుణిత అష్టావధానాన్ని పూర్తి చేశారు. అవధానానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన ఉమర్ అలీషా సభను వర్ణిస్తూ ఒక పద్యం చెప్పమన్నారు. ‘సమరసభావాత్మకమై– సుమనస్సుజ్ఞేయమగుచు, సూఫీ మయమై–ఉమరాలీషా నెలవై–అమలంబుగ ఈ సభ అలరుచుండెన్’అని సందీప్ వర్ణించారు.
నవ్వులు పూయించిన అప్రస్తుతాలు
పద్యపూరణాలు సీరియస్‌గా సాగుతున్నాయి. అప్రస్తుత ప్రసంగంచేసే వెంకట లక్ష్మి ఒక సందేహం లేవనెత్తింది. ‘అవధానిగారూ! మా వీధిలో అందరికీ కుక్కలున్నాయి. అందరూ ఇంటిముందు ‘కుక్క ఉన్నది జాగ్రత్త’ అని బోర్డుపెట్టుకున్నారు. మా ఇంట కుక్కలేదు. నేను ఏమని బోర్డుపెట్టుకోవాలి?’ అవధాని సమాధానం చెబుతూ ‘వెంకటలక్ష్మి ఉన్నది’ అని బోర్డు పెట్టుకుంటే చాలునన్నారు. మహ్మద్‌ఖాదర్ ఖాన్ తన వంతు ప్రశ్నగా ‘అవధానిగారూ! వేంకటేశ్వరస్వామికి, మాకు బంధుత్వంఉంది, ఏమిటో చెబుతారా?’ అనడిగారు. వేంకటేశ్వరస్వామి బీబీనాంచారమ్మను చేపట్టాడని అవధాని సమాధానం ఇచ్చారు.
పాత్రలు–పాత్రధారులు
శతావధానిని ఫుల్లాభట్ల నాగ శాంతి స్వరూప, ద్విశతావధానిని ఆకెళ్ల బాలభానులు నిషిద్ధాక్షరి. మంగళంపల్లి పాండురంగ విఠల్, పద్యకవి తిలక ఎస్వీ రాఘవేంద్రరావులు సమస్య. చిరువోలు విజయ నరసింహారావు, ఎస్‌పీ గంగిరెడ్డిలు దత్తపది, ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి, ఓలేటి బంగారేశ్వరశర్మలు వర్ణన, సప్పా దుర్గాప్రసాద్, రామచంద్రుని మౌనికలు ఆశువు, ఖాదర్‌ఖాన్, వెంకట లక్ష్మిలు అప్రస్తుత ప్రసంగం. తిరిగి నాగశాంతి స్వరూప, వెంకటలక్ష్మిలు ఘంటావధానం . ప్రసాదవర్మ వారగణనం. అవధానం సంచాలకత్వం– డాక్టర్« దూళిపాళ మహాదేవమణి. ఆశీస్సులు–చింతలపాటి శర్మ
Advertisement