
సెస్ బాదుడు
- గొప్పలు ఆర్టీసీకి... భారం ప్రయాణికులకు సెస్ పేరుతో అదనపు చార్జీ వసూలు
- ఇబ్బందుల్లో ప్రయాణికులు
ధర్మవరంటౌన్ :
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు మరణించిన వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉంటోంది. ప్రమాద బాధితులను ఆదుకోవడం ఆర్టీసీకి తలకుమించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రమాద భాదితులకు ప్రమాద పరిహారం అందించేందుకు ప్రభుత్వం, ఆర్టీసీ సెస్ చార్జీల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ఆర్టీసీ బస్సులో ప్రమాదానికి గురై మరణిస్తే ఆ బాధితులకు 24 గంటలలోపే రూ.5 లక్షల పరిహారాన్ని అందిస్తారు. ఈ విధానం 6 నెలలుగా అమలవుతోంది. దీని ద్వారా ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, గరుడా, అల్ట్రా డీలక్స్ తదితర సర్వీసుల్లో ప్రయాణించే ప్రయాణీకులకు టిక్కెట్ ధర కన్నా రూ.1 ని అదనంగా వసూలు చేస్తారు. పల్లె వెలుగుబస్సులకు మాత్రం సెస్ చార్జీలు మినహాయింపు ఉంది. దీని ద్వారా ధర్మవరం డిపో పరిధిలో నెలకు దాదాపు రూ.7 లక్షల దాకా అదనంగా వసూలవుతోంది. ఈ మొత్తాన్ని ప్రమాద భాదితులకు అందించేందుకు వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రమాద బాధితులకు పరిహారం అందించాల్సిన బాధ్యత ఆర్టీసి సంస్థతో పాటు ప్రభుత్వాలకు సంబంధించిన విషయమని వారు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రయాణికులతో వసూలు చేయడం సమంజసం కాదని పలువురు ప్రయాణీకులు చెబుతున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం : బాబా, ప్రయాణికుడు, ధర్మవరం
తరచూ మేం ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తుంటాం. ఇప్పటికే పెంచిన చార్జీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దీనికితోడు సెస్ పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నా రు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించాలి
చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలి : ఎస్‌హెచ్‌బాషా, సీపీఎం డివిజన్ కార్యదర్శి
సెస్ విధానం ద్వారా భాదితులకు సత్వర నష్టపరిహారం అందించడం స్వాగతించగదగ్గ విషయం. అయితే ఆ భారాన్ని ప్రజలపై మోపకుండా ఆర్టీసీ సంస్థ, ప్రభుత్వమే భరించాలి. పెంచిన ఆర్టీసీ ధరలను తగ్గించి సెస్ చార్జీలను ఉపసంహరిస్తే ప్రయాణికులకు ఎంతో మేలు.