
అఖిలప్రియ అనాథ ఎందుకయ్యారు?
నంద్యాల: వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే నంద్యాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని నంద్యాల ఉప ఎన్నిక వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి కోరారు. నంద్యాల ఎస్పీజీ మైదానంలో గురువారం వైఎస్సార్ సీపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే తప్పనిసరిగా నంద్యాలను ప్రత్యేక జిల్లాగా చేయాలని కోరుతున్నాను. ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. మీరు నంద్యాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తే అభివృద్ధి పథంలో దూసుకుపోతాం. ఈ రోజు అఖిలప్రియను అడుగుతున్నాను. సిటీ కెబుల్ మీదే.. నంద్యాలలో సాక్షి టీవీ ఎందుకు రావడం లేదు. ఐదేళ్లు టీవీ9ను బంద్ చేశారు. ఈ రోజు సాక్షి ప్రసారాలు బంద్ చేశారు. అనాధ బిడ్డలను ఆశీర్వదించమని బోర్డులు పెట్టుకొని తిరుగుతున్నారు. మీ తండ్రిని ఎవరైనా చంపారా? మీ తండ్రి ఎంత మందిని అనాథలుగా చేశారో గుర్తు చేసుకోండి. ఆ కుటుంబం పరిస్థితి ఏందో ఆలోచించండి. ఉప ఎన్నికల వేళ చంద్రబాబు నంద్యాలపై ప్రేమ ఒలకబోస్తున్నట్టు నటిస్తున్నారు.
ఇదే దీబగుంట్లకు చంద్రబాబు వచ్చినప్పుడు రోడ్ల విస్తరణ గురించి అడిగాను. చాలా సందర్భాల్లో అడిగాను. ఆ రోజు అమరావతికి డబ్బులు లేవు అన్నారు. మీ వద్ద డబ్బులు ఉంటే సగం పెట్టుకోమని చెప్పారా? లేదా? ఆ రోజు డబ్బులు లేవని, ఈ రోజు ఉప ఎన్నిక ఉందని హడావుడిగా రోడ్డు విస్తరణ పనులు మొదలు పెట్టారు. పక్కా ఇళ్ల్లకు ఎన్ని అర్జీలు వచ్చాయే చెప్పండి. ఆ రోజు ఉచితంగా ఇళ్లు కట్టిస్తానని భూమా మాట ఇచ్చారు. ఆ మాట తప్పారు. ఫరూక్ ముస్లింల వద్ద నాపై విష ప్రచారం చేస్తున్నారు. ముస్లింలకు తోడుగా ఉండింది నేనే. ఎన్నో షాదీఖానాలు, మసీదులు నిర్మించాను. ఎంతో సాయం చేశాను. ఈ రోజు ముస్లింల పేరుతో విష ప్రచారం చేస్తున్నారు. శిల్పా ఏ ముస్లిం సోదరుడిని కూడా అవమానించలేదు. తప్పుగా మాట్లాడలేదు. కరీం, ఇస్సాక్, మగ్బుల్, చాంద్ వంటి పెద్దలు ఉన్నారు.
ఆ రోజు రౌడిషీట్ విషయంలో బెయిల్ ఇప్పించింది నేనే. ఎంపీ ఎస్పీవైరెడ్డి, ఫరూక్ ఊర్లో ఉండి కూడా ముస్లింలను పలకరించేందుకు స్టేషన్‌కు వెళ్లలేదు. నేను ఆ రోజు ఊర్లో లేక పలకరించలేకపోయాను. ముస్లింలను ఎప్పుడు అగౌరవపర చలేదు. ఒక వేళ ఏదైనా చిన్న గాయం చేసినా క్షమించమని మనస్ఫూర్తిగా ముస్లింలను కోరుతున్నాను. రాజకీయాలను మతాలకు, కులాలకు వాడుకోవద్దని టీడీపీ నాయకులను కోరుతున్నాను. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాకు రాజకీయ భిక్ష పెట్టారు. అందుకే ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడ్డాం. నేను కానీ, నా తమ్ముడు గానీ ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్ కుటుంబం కోసం, నంద్యాల ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తామని హమీ ఇస్తున్నాన’ని శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు.