
చస్తున్నా పట్టదా? స్టాండింగ్ కమిటీ ఆగ్రహం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో విషజ్వరాల భారినపడి పలువురు మృత్యువాత పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మేయర్ అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్ మార్కెట్ల నిర్వహణ..విధివిధానాలకు సంబంధించిన అంశాన్ని సమావేశం తిరస్కరించారు. విధివిధానాలు రూపొందించి తదుపరి కమిటీ సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. గ్రేటర్‌లో ఆటస్థలాలు, స్విమ్మింగ్ పూల్స్ నిర్వహణలోని మార్పుల ప్రతిపాదనల్ని సైతం కమిటీ తిరస్కరించింది.
సమావేశంలో ఆమోదించిన అంశాలు..
► ఎస్సార్‌డీపీలో భాగంగా దుర్గం చెరువుపై 80 అడుగుల వేలాడే వంతెనకు అవసరమైన ఆస్తుల సేకరణ.
► జీహెచ్‌ఎంసీలో ఈఆర్‌పీ, ఇతర పద్దుల నిర్వహణ మూడునెలల పాటు ‘బ్లూమ్స్ సొల్యూషన్స్’కు అప్పగించేందుకు ఆమోదం. నిర్వహణ చార్జీల కింద రూ. 18,41,281 చెల్లించేందుకు ఏకగ్రీవంగా ఆమోదం. అకౌంట్ల నిర్వహణను కొత్త ఏజెన్సీకి అప్పగించేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఈ సంస్థకే నిర్వహణను అప్పగించాలని తీర్మాణం. జీహెచ్‌ఎంసీలో గతంలో ఈ పద్దులను నిర్వహించిన అనుభవం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి ఈసేవలను ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు.
► జంక్షన్ల అభివృద్ధి పనుల కోసం భూసేకరణ, భూ బదలాయింపులకు ఆమోదం. మెరుగైన రవాణాకు ఆటంకాలుగా ఉన్న బస్‌బేల తొలగింపు, 55 ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ఆమోదం.
► నిర్ణీత వ్యవధుల్లోని పద్దుల నిర్వహణ, వ్యయ పట్టికలను ఆమోదించాల్సిందిగా ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం.