
పిల్లలతో సారిక(ఫైల్)
వరంగల్: కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె పిల్లల సజీవ దహనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్న నేపథ్యంలో సారిక, ఆమె పిల్లలు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది.
రాజయ్య కుమారుడు అనిల్, కోడలు సారిక మధ్య కొన్నేళ్లుగా సఖ్యత లేదని స్థానికులు తెలిపారు. ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవని, ఏడాది నుంచి పిల్లలతో ఇంట్లో కోడలు మాత్రమే ఉంటోందని చెప్పారు. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అన్నారు. పిల్లలకు చిన్నదెబ్బ తగిలిన ఆమె తట్టుకోలేకపోయేదని వెల్లడించారు. గ్యాస్ సిలిండర్ పేలితే పెద్ద శబ్దం వచ్చేది కాదా అని ప్రశ్నించారు.
నిజామాబాద్ జిల్లా వడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన సారికను రాజయ్య కుమారుడు అనిల్ 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో రాజయ్య కుటుంబంపై ఆమె 498 కేసు పెట్టింది.