వరంగల్ జైలుకు రాజయ్య
సాక్షి, హన్మకొండ: కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల మృతి కేసులో వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్‌కు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి గురువారం 15 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వీరిని వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు. అంతకుముందు వారిని పోలీసులు మామూనూరు పోలీసు స్టేషన్‌లో ఏసీపీ మహేందర్, హన్మకొండ ఏసీపీ శోభన్‌కుమార్‌ల ఆధ్వర్యంలో సుదీర్ఘంగా విచారించారు. రాత్రి 10.30 సమయంలో వరంగల్ ఆరో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి అజేశ్‌కుమార్ ఎదుట హాజరుపరిచారు.
కోర్టుకు తీసుకువచ్చే ముందు ఈ ముగ్గురికి ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సారిక, ముగ్గురు పిల్లల మృతి కేసులో ఆమె భర్త అనిల్, అత్త మాధవి, మామ రాజయ్య, అనిల్ రెండో భార్య సనాను నిందితులుగా పేర్కొన్నారు. వారిపై సుబేదారి పోలీసు స్టేషన్‌లో ఐపీసీ 306, 498ఏ, 174 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదయ్యాయి. కాగా అనిల్ రెండో భార్యను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
వీడియోలో పోస్టుమార్టం చిత్రీకరణ
సారిక, ముగ్గురు పిల్లల మృతదేహాలకు గురువారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించారు. నలుగురి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోస్టుమార్టం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించారు. మృతదేహాలను తీసుకునేందుకు సారిక తల్లి, బంధువులు నిరాకరించారు. రాజయ్య కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే నచ్చచెప్పడంతో మృతదేహాలను సాయంత్రం 4:40 గంటలకు తీసుకున్నారు. రాజయ్య కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు రాలేదు.
భోజనంలో మత్తు పదార్థాలు కలిశాయా?
ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. పోస్టుమార్టం సమయంలో మృతదేహాలకు సంబంధించిన ఆవయవాలను హైదరాబాద్‌లోని ఫోర్స్‌న్సిక్ ల్యాబ్ పంపించారు. ఈ నివేదిక వెల్లడైతే తప్ప ఇది హత్యా లేదా ఆత్మహత్య అనేది తేలుతుందని పోలీసు వర్గాలు అంటున్నాయి. సారికతో పాటు ముగ్గురు చిన్నారులు మంగళవారం రాత్రి తిన్న భోజనంలో ఏమైనా మత్తు పదార్థాలు కలిశాయా? అనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది.
మంటల కారణంగా వ్యాపించిన పొగలో సారిక ముగ్గురు చిన్నారులు కొట్టుమిట్టాడినట్లు తెలుస్తోంది. మృతుల శ్వాసనాళాల్లో పొగ ఆనవాళ్లు వైద్యులు కనుగొన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన గదిలో గంటపాటు నిర్విరామంగా మంటలు చెలరేగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మంటల వ్యాప్తిలో ఒకే సిలిండర్ కాలిపోయినట్లు కానరావడం.. మరో సిలిండర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగినట్లు ఆనవాళ్లు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.