దర్యాప్తులో తేల్చిన బేగంపేట మహిళా పోలీసులు
భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు
సారికను ఇంట్లోకి రానీయకుండా విడిగా ఉంచారు
2014లో కోర్టు ఆదేశం మేరకు కేసు నమోదు
అత్తింటి వేధింపులపై కింద టేడాది రాజయ్య కోడలు ఫిర్యాదు
హైదరాబాద్: మాజీ ఎంపీ రాజయ్య కుమారుడు అనిల్, వారి కుటుంబసభ్యులు సారికను తీవ్రంగా వేధించారని హైదరాబాద్‌లోని బేగంపేట మహిళా పోలీసుస్టేషన్ అధికారులు నిర్ధారించారు. ఆమె భర్త సనా అనే యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ సారికను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని తేల్చారు. 2014 ఏప్రిల్‌లో సారిక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ మేరకు నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అనిల్‌పై సెక్షన్ 498 (వేధింపులు), సెక్షన్ 494 (వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు) కింద అభియోగాలు నమోదుచేశారు. అప్పట్లో న్యాయస్థానం ద్వారా వస్తే తప్ప సారిక ఫిర్యాదు కేసుగా మారలేదు.
తనను వేధించిన వారిలో భర్తతోపాటు మామ రాజయ్య, అత్త మాధవి, సనా కూడా ఉన్నారని సారిక తన ఫిర్యాదులో ఆరోపించింది. వీరు తనను పనిమనిషి కంటే హీనంగా చూస్తున్నారని తెలిపింది. దర్యాప్తులో రాజయ్య ప్రమేయం వెలుగులోకి రాకపోవడంతో మిగతా ముగ్గురిపై చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. సారికను ఇంటి పైఅంతస్తులో విడిగా ఉంచిన రాజయ్య కుటుంబం నెలవారి ఖర్చులకూ డబ్బు ఇవ్వకుండా వేధించిందని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఆమెతో సహా పిల్లల్నీ ఇంట్లోకి రానీయలేదని, పిల్లల చదువులకు అవసరమైన డబ్బులూ అందించకుండా నిత్యం అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశారని అభియోగాలు మోపారు.
ఇన్‌స్పెక్టర్ జానకి తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లయిన తర్వాత కొన్నేళ్లు బాగానే ఉన్నప్పటికీ సనా అనే యువతితో అనిల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పట్నుంచి వారి ఇంటి పైఅంతస్తులో సారికను విడిగా ఉంచారు. వీటిని తాళలేక సారిక కోర్టును ఆశ్రయించింది. వరంగల్‌లో రాజయ్య తన రాజకీయ పలుకుబడితో కేసును నీరుగారుస్తారని, ఈ కేసును తాను వివాహం చేసుకున్న మారేడ్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంతానికి సిఫారసు చేయాలని సారిక అప్పీలు పెట్టుకుంది.
ఈ క్రమంలోనే వివాహం జరిగిన ప్రాంతం ఆధారంగా కోర్టు బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు కేసును అప్పగించింది. అనంతరం పలుమార్లు అనిల్, సారికలకు పోలీసులు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. అయినప్పటికీ అనిల్‌లో మార్పు రాలేదని తనకు, పిల్లలకు న్యాయం చేయాలంటూ సారిక మళ్లీమళ్లీ పోలీసుల వద్దకు వచ్చింది. ఈ క్రమంలో జరిగిన విచారణలో భాగంగా భర్త అనిల్, అత్త మాధవితో పాటు సనాపైనా చార్జీషీటు దాఖలు చేశారు.
సారికను తీవ్రంగా వేధించారు
Published Thu, Nov 5 2015 3:38 AM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM
Advertisement
Advertisement