బతుకమ్మకు పుట్టింటికి వచ్చి..
కుటుంబీకులతో సంతోషంగా గడిపిన సారిక
మృతితో తల్లడిల్లిన తల్లిదండ్రులు
అడ్లూర్ ఎల్లారెడ్డిలో విషాద ఛాయలు
సదాశివనగర్: బతుకమ్మ, దసరా పండుగకు నిజామాబాద్ జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలోని తన పుట్టింటికి వచ్చిన సారిక... తల్లిదండ్రులు, బంధువులతో సంతోషంగా గడిపింది. పుట్టింటి నుంచి వెళ్లిన కొద్దిరోజులకే తన కూతురు పిల్లలతో సహా సజీవ దహనమైందన్న సంగతి తెలిసి తల్లి హృదయం తల్లడిల్లింది. అనారోగ్యంతో ఉన్న తండ్రికి విషయం తెలియనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. వంగల శ్రీనివాస్‌చారి, లలిత దంపతులకు ముగ్గురు కూతుళ్లు. అర్చన, సారిక, దీపిక. సారిక రెండో కూతురు. బుధవారంనాటి ఘటన తెలియగానే అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో విషాదం అలుముకుంది. ముగ్గురు పిల్లలు కూడా సజీవ దహనం కావడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతు న్నారు. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అంటున్నారు.
అత్తింటి వారే చంపారు..
తమ కూతురు సజీవదహనం కావడానికి భర్త అనిల్, అత్త మాధవి, మామ రాజయ్యలే కారణమని సారిక తల్లి లలిత, సోదరి అర్చన ఆరోపించారు. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘‘మా కూతురు ముగ్గురు కుమారులను చూసుకుంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. కావాలనే కక్షతోనే చంపేశారు. సారిక భర్త, అత్త, మామలపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని లలిత అన్నారు. అర్చనతో కలిసి బుధవారం సాయంత్రం లలిత వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి వచ్చారు. ‘నా బిడ్డను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఆమె విలపించారు. పిల్లల స్కూల్ ఫీజులు సైతం చెల్లించకుండా సారికను ఇబ్బంది పెట్టారని అర్చన తెలిపారు.