నిందితులు కామేష్, నాగార్జున
నేరేడ్‌మెట్: రామకృష్ణాపురం చెరువులో ఇద్దరు యువతుల ఆత్మహత్య కేసులో నేరేడ్‌మెట్ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం ఇన్‌స్పెక్టర్ జగదీష్‌చందర్ తెలిపిన వివరాల ప్రకారం... మౌలాలి తిరుమలనగర్‌కు చెందిన చిరంజీవి కుమార్తె మౌనిక (20) ఘట్‌కేసర్‌లోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. మౌనిక వాయుపురి రోహిణి కాలనీకి చెందిన నాగార్జున అలియాస్ నాని (24) ప్రేమించుకుంటున్నారు. బీటెక్ చదివిన నాగార్జున శంషాబాద్‌లోని అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కులాలు వేరుకావడం, మౌనికను పెళ్లాడితే కట్నం కూడా రాదని భావించిన నాగార్జున మౌనికను పక్కన పెట్టాడు.
వేరే అమ్మాయితో ఈనెల 4న పెళ్లి నిశ్చితార్థం చేసుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలాఉండగా... మౌలాలి తిరుమల టవర్స్‌లో ఉండే తన స్నేహితుడైన ఫొటోగ్రాఫర్ బాలకామేశ్వర్‌రావు అలియాస్ కామేష్ (24)ను మౌనికకు నాగార్జున పరిచయం చేశాడు. అది కాస్తా వారి మధ్య ప్రేమగా మారి మౌనికను కామేష్ పెళ్లాడతానని హామీ ఇచ్చాడు. అయితే, నాగార్జునను మరిచిపోలేకపోతున్న మౌనిక తరచూ అతడి పేరు కామేష్ ముందు ప్రస్తావించేది. దీంతో ఆగ్రహానికి గురైన కామేష్.. నాగార్జునతో కలిసి ఓ పథకం వేశాడు. ‘‘తనకు నాగార్జునకు ఎలాంటి సంబంధంలేదు, మళ్లీ నాగార్జునను ఇబ్బంది పెట్టను’’ అని మౌనికతో బాండ్ రాయించుకున్నారు.
ఆ తర్వాత కామేష్ ఆమెను పలు రకాలుగా బ్లాక్ మెయిల్ చేస్తూ వేధించడం ప్రారంభించాడు. ఓ వైపు కామేష్ వేధింపులు మరో వైపు ప్రేమికుడు నాగార్జునకు 4వ తేదీన పెళ్లి నిశ్చితార్థం జరుగుతుండటంతో జీవితంపై విరక్తి చెందిన మౌనికి ఆత్మహత్యకు సిద్ధమైంది. ఇదిలా ఉండగా.. ఈమెకు వరుసకు చెల్లెలు సౌమ్య రాజేశ్వరి (16) స్వస్థలం పశ్చిమగోదావరిజిల్లా ఉండి. సౌమ్య తండ్రి బ్రహ్మానందశర్మ 2013లో, తల్లి వల్లికాదేవి 2014లో మృతి చెందారు. దీంతో సౌమ్యను పెద్దనాన్న నగరంలోని హాస్టల్‌లో ఉంచి ఇంటర్ చదివిస్తున్నాడు. సౌమ్యను మామలు సుబ్రహ్మణ్యం, నాగేశ్వరశర్మ, అత్త శ్రీదేవి కొన్ని రోజులుగా వేధిస్తున్నారు. ఈమెకు ఆరోగ్యం బాగోకపోవడంతో 20 రోజుల క్రితం అక్క మౌనిక ఇంటికి వచ్చింది.
తాము ఎదుర్కొంటున్న వేధింపులు ఒకరికొకరు చెప్పుకున్న ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 4న రామకృష్ణాపురం చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మౌనిక మృతికి కారణమైన కామేష్‌ను మంగళవారం రామకృష్ణాపురం రైల్వే స్టేషన్‌లో పట్టుకోగా... నాగార్జున నేరుగా ఠాణాకు వచ్చి లొంగిపోయాడు. దీంతో ఇద్దరినీ బుధవారం రిమాండ్‌కు తరలించారు. కాగా, సౌమ్య మృతికి కారణమైన ఇద్దరు మామలను, అత్తను త్వరలోనే అరెస్టు చేస్తామని ఇన్‌స్పెక్టర్ జగదీష్‌చందర్ అన్నారు.