కడప : వైఎస్ఆర్ జిల్లా కడప సెంట్రల్ జైలు నుంచి నలుగురు ఖైదీలు పరారు కావడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ఆరుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ డీజీ కృష్ణంరాజు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం కడప సెంట్రల్ జైలు నుంచి నలుగురు ఖైదీలు పారిపోయిన విషయం విదితమే. ఈ విషయమై విచారణ జరిపేందుకు రాష్ట్ర జైళ్ల డైరెక్టర్ జనరల్ కృష్ణంరాజు మంగళవారం కడపకు వెళ్లారు. అధికారులను విచారించిన ఆయన ఆరుగురు అధికారులను సస్పెండ్ చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ రామకృష్ణ, జైలర్లు శేషయ్య, గురుశేఖర్ రెడ్డి, డిప్యూటీ జైలర్లు బ్రహ్మారెడ్డి, గోవిందరావు, చీఫ్ హెడ్ వార్డర్ గోపాల్‌నాయక్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గోవిందరాజులు దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఉన్నతాధికారులే ఆయనను సెలవులో వెళ్లమని ఆదేశించినట్లు తెలుస్తోంది. సెంట్రల్ జైలు ఇన్‌చార్జ్‌గా డీఐజీ జయవర్ధన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. నిచ్చెన అందుబాటులో లేకుండా చూసి ఉంటే ఖైదీలు పారిపోయేవారు కాదని డీజీ అన్నారు. పరారీలో ఉన్న ఖైదీల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆయన చెప్పారు. అంతకు ముందు కడప జైళ్ల సూపరింటెండెంట్ గోవిందరాజులు మాట్లాడుతూ.. సెంట్రల్ జైలులో మసీదు నిర్మాణంలో ఉపయోగించే రీఫర్లను నిచ్చెనగా తయారుచేసుకుని ఖైదీలు పారిపోయారని చెప్పారు.
ఆరుగురి సిబ్బందిపై వేటు: జైళ్లు శాఖ డీజీ
Published Tue, Dec 29 2015 6:31 PM | Last Updated on Thu, Mar 28 2019 5:34 PM
Advertisement
Advertisement