
లారీ వెనక బాలుడి మృతదేహం
♦ బాలుడిని చిదిమేసిన లారీ
♦ వలస కుటుంబానికి తీరని శోకం
బోయినపల్లి(చొప్పదండి) : అప్పటిదాకా ఆ బాలుడు అమ్మ ఒడిలో ఆడుకున్నాడు. ఇంట్లో పని ఉండడంతో తల్లి లోపలికి వెళ్లగా.. ఇంటిముందు ఆడుకుంటూనే క్షణాల్లో మృత్యుఒడిలోకి చేరాడు. మృత్యురూపంలో వచ్చిన లారీ ఆ ముక్కుపచ్చలారని బాలుడిని కబళించింది. ఈ విషాదకరమైన సంఘటన బోయినపల్లి మండలం కొదురుపాక క్రాస్‌రోడ్డు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మేదరిమడ్ల గ్రామానికి చెందిన వైనాల తిరుమల, రాజు దంపతులు. కొదరుపాక క్రాస్‌రోడ్డులో ఉన్న సిమెంట్ బ్రిక్స్‌లో పనిచేసేందుకు వచ్చారు. ఇద్దరు వాచ్‌మెన్, కార్మికులుగా ఆర్నెల్ల నుంచి పనిచేస్తున్నారు. వీరికో బాబు, పాప సంతానం. కొడుకు అయన్(18నెలలు)ను తల్లి తిరుమల ఇంటిముందు ఆడిస్తోంది.
డ్రైవర్ అజాగ్రత్తతో పోయిన ప్రాణం
కొడుకును ఆడుకోమని చెప్పిన తల్లి ఇంట్లో పని ఉండడంతో లోపలికి వెళ్లింది. ఆమె అలా లోపలికి వెళ్లిందో..లేదో.. యాష్‌డస్ట్‌తో వచ్చిన లారీ అయన్‌ను ఢీకొంది. బాలుడు వెనుక టైరుకింద పడిపోవడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందాడు. కళ్లముందు అప్పటివరకు ఆడుకున్న కుమారుడు మృత్యుఒడిలోకి చేరడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. రాజును ఆపడం ఎవరితరమూ కాలేదు. అజాగ్రత్తగా లారీ నడిపి బాలుడి మృతికి కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ బుచ్చినాయుడు తెలిపారు.