యథేచ్ఛగా దొంగ రిజిస్ట్రేషన్లు
Published Sat, Aug 10 2013 1:27 AM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : బెజవాడ కేంద్రంగా రియల్ ఎస్టేట్ మాఫియా మోసాలకు పాల్పడుతోంది. దొంగ డాక్యుమెంట్ల తయారీ ముఠాలు తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. విజయవాడలో రెండు బ్యాచ్‌లు యథేచ్ఛగా దొంగ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నాయి. నకిలీ డాక్యుమెంట్లు, బినామీ ఆసాములను సృష్టించి, బోగస్ సాక్ష్యాధారాలతో ఇతరుల ఆస్తులను విక్రయించేసి సొమ్ము తీసుకుని బ్రోకర్లు పరారవుతున్నారు. గన్నవరంలో ఓ ముఠా ఇతరుల ఆస్తి తమదని నకిలీ డాక్యుమెంట్లతో ఓ ఫైనాన్షియర్‌ను మోసగించే ప్రయత్నం చేశారు.
అధికారులు అప్రమత్తం కావటంతో ఆగంతకులు పరారయ్యారు. ఇదే తరహాలో గన్నవరంలో గత ఏడాది కాలంలో ఈ ముఠాలు నాలుగైదు బోగస్ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తోంది. వారి బారినపడివారు లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు సమాచారం. గత ఏడాది విజయవాడ గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ డాక్యుమెంట్లతో ఒకరికి రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు. పోయిన సంవత్సరం నున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని ఓ ఆస్తిని దొంగ కాగితాలతో రిజిస్ట్రేషన్ చేశారు. రెండేళ్ల క్రితం ఆత్కూరుకు చెందిన ఓ రైతు పాలాన్ని విజయవాడలో ఓ పారిశ్రామికవేత్తకు గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ డాక్యుమెంటుతో సేల్ డీడ్ రాసి రూ.10 లక్షలతో ఉడాయించారు. రైతు తన భూమిని విక్రయించాలని కోరుతూ రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు పొలం డాక్యుమెంట్ ఫొటోస్టాట్ కాపీ ఇచ్చారు. దాని ఆధారంగానే బినామీ వ్యక్తులు పొలాన్ని విక్రయించేశారు.
గన్నవరం పరిధిలో అధికంగా మోసాలు..
గన్నవరం ప్రాంతంలో ఐటీ పార్కు, విమానాశ్రయం కారణంగా రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భూముల ధరలకు రెక్కలు రావటంతో ఇక్కడి ఆస్తులపై మోసాలు అధికంగా జరుగుతున్నాయి. విజయవాడలో పలువురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు నకిలీ డాక్యుమెంట్ల తయారీలో సిద్ధహస్తులైన వ్యక్తులను అడ్డం పెట్టుకుని నకిలీ స్టాంపులు తయారుచేయిస్తున్నారు. వాటిద్వారా డాక్యుమెంట్లు రాయించి జనాన్ని మోసం చేస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో, గన్నవరం, నున్న, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, కంకిపాడు తదితర ప్రాంతాలలో వందలాది వెంచర్లు ఉండటంతో ఈ తరహా మోసాలు అధికమవుతున్నాయి. మోసపోయినవారు కేసులు కూడా పెట్టడం లేదు.
ఆన్‌లైన్‌తో చెక్..
మరోపక్క రిజిస్ట్రేషన్స్ శాఖలో ఆన్‌లైన్ విధానం అమలులోకి వచ్చింది. ఈ విధానం పూర్తిస్థాయిలో వాడుకలోకి వస్తే బోగస్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టవచ్చని అధికారులు అంటున్నారు. వేలిముద్రలు, ఫొటోలు కూడా ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లో రావటం వల్ల భవిష్యత్తులో నకిలీల బెడద తగ్గుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు రియల్ మాఫియా విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Advertisement
Advertisement