
తల్లి మృతదేహం గుట్టుగా ఖననం
సోదరులు, బంధువులకూ సమాచారమివ్వని ప్రబుద్ధుడు
భూపాలపల్లి: కన్నతల్లి మరణిస్తే ఆ విషయాన్ని కనీసం తన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లకు కూడా చెప్పకుండా గుట్టుగా ఖననం చేశాడో ప్రబుద్ధుడు. వరంగల్ జిల్లా భూపాలపల్లి ఎల్‌బీనగర్‌లో శుక్రవారం ఈ ఉదంతం జరగగా శనివారం వెలుగులోకి వచ్చింది. కట్కూరి మల్లమ్మ(80)కి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. భూపాలపల్లి ఎల్‌బీనగర్‌లో ఉండే ఆమె రెండో కుమారుడు శ్రీనివాస్ మల్లమ్మను నాలుగు నెలల క్రితం ఇంటికి తీసుకొచ్చాడు. శుక్రవారం ఉదయం మల్లమ్మ పెద్దకుమార్తె బల్ల సరస్వతి తల్లిని చూసేం దుకు వచ్చింది. పళ్లరసం తాగించిన తర్వాత సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. కొద్దిసేపటికి మల్లమ్మ మృతి చెందింది.
ఈ విషయాన్ని శ్రీనివాస్ తన అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములకు, బంధువులకు ఎవరికీ చెప్పలేదు. భార్య సహాయంతో తల్లి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లి ఖననం చేశాడు. సాయంత్రం సరస్వతి తిరిగి ఇంటికి వచ్చేసరికి తల్లి మరణించిందని తెలియడంతో భోరున విలపిస్తూ సోదరులకు,బంధువులకు సమాచారం అందించింది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి శ్రీనివాస్, అతని భార్య కృష్ణవేణిలపై ఫిర్యాదు చేసింది. శనివారం ఎస్సై గణపతి, తహసీల్దార్ సత్యనారాయణలు శ్మశానవాటికకు వెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. అంత్యక్రియ ఖర్చులు భరించాల్సి వస్తుందనే భయంతోనే ఇలా చేసినట్లు భావిస్తున్నారు. కాగా, శ్రీనివాస్ తండ్రి నుంచి వారసత్వంగా ఉద్యోగం పొందాడు.