సోషల్ మీడియా స్నేహితులతో జాగ్రత్త
అనంతపురం కల్చరల్ : సామాజిక మాద్యమాల ద్వారా స్నేహితులుగా మారి ప్రేమ పేరుతో వంచించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు అమ్మాయిలకు సూచించారు. ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక లలితకళాపరిషత్తులో ‘అమ్మాయిలు.. జర జాగ్రత్త’ అన్న అంశంపై ఆలోచనాత్మక సదస్సు జరిగింది. జిల్లా ఎస్పీ రాజశేఖరబాబుతో పాటు ప్రముఖ సినీ దర్శకుడు బాబ్జి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ చదువు కోసం నగరానికొచ్చే యువతులు అమాయకంగా అబ్బాయిల చేతిలో మోసపోతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భ్రమలు కల్పించే రంగుల ప్రపంచానికి లోను కాకుండా చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. ఆడపిల్లలున్న హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి పోలీసు వ్యవస్థ చర్యలు తీసుకుంటోందన్నారు. ఐద్వా ఇటువంటి చక్కటి కార్యక్రమాల ద్వారా అమ్మాయిలకు, మహిళలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. ‘అబ్బాయిలు.. మా జోలికొస్తే జర జాగ్రత్త’ అంటూ హెచ్చరించే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రేమను వస్తువుగా పెట్టి తీస్తున్న సినిమాలు సమాజాన్ని పెడదోవపట్టకుండా ఉండాలని అభిప్రాయపడ్డారు.
సామాజిక మాధ్యమాల పట్ల అçప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియా కాలక్షేపానికి లేదా విజ్ఞాన విషయాల సేకరణకు ఉపయోగపడాలే తప్ప యువతులను మోసం చేసే ప్రత్యామ్నాయంగా మారొద్దని సూచించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కసాపురం ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ఐద్వా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, డా.ప్రసూన, డా.ప్రగతి, వెంకటలక్ష్మమ్మ, విజయ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రమేష్ నగర కార్యదర్శి సూర్యచంద్ర పాల్గొన్నారు.