ప్రాణాలు తీసిన అతివేగం
- ఐచర్, ఆటో ఢీ
- ఇద్దరు యువకులు మృతి
- పరారీలో ఐచర్‌వాహన డ్రైవర్
- కప్పట్రాళ్లలో విషాదం
కోతిరాళ్ల (పత్తికొండ రూరల్): అతివేగం ఇద్దరి ప్రాణాలను తీసింది. వివాహ రిసెప్షన్‌కు సప్లయి సామగ్రి తీసుకొద్దామని వెళ్లిన ఇద్దరు యువకులు షేక్ అఫ్రోజ్(20), ముల్లా అజారుద్దీన్(22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన కోతిరాళ్ల గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో పత్తికొండకు చెందిన గూడుసాబ్ కుమార్తె రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నగరం అంబర్‌పేట్, న్యూ పటేల్ నగర్‌కు చెందిన నజీర్ కుమారుడు షేక్ అఫ్రోజ్, అలాగే గోనెగండ్లకు చెందిన నూర్‌బాషా కుమారుడు ముల్లా అజారుద్దీన్ వచ్చారు. సప్లయి సామగ్రి తీసుకొచ్చేందుకు వీరు పత్తికొండకు ఆటోలో బయలు దేరారు. ఆటోను అఫ్రోజ్ నడుపుతుండగా.. పత్తికొండ మండలం కోతిరాళ్ల గ్రామ సమీపంలో దేవనకొండ వైపుకు వెళ్తున్న ఎపి 02 ఎ 3296 ఐచర్ వాహనం ఎదురుగా వచ్చి బలంగా ఢీకొనింది.
దీంతో ఆటో నుజ్జునుజ్జు అయి రోడ్డు పక్కన గుంతలో పడింది. ఆటో తోలుతున్న షేక్ అఫ్రోజ్ అక్కడిక్కడే మృతి చెందాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ముల్లా అజారుద్దీన్‌ను రోడ్డుపై వెళ్తున్న ఎమ్మిగనూరుకు చెందిన ఆటో డ్రైవర్ అంజనేయులు గమనించి తన ఆటోలో పత్తికొండ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించాడు. అయితే వైద్యులు చికిత్స అందిస్తుండగా కోలుకోలేక అతను మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఐచర్ వాహనం బలంగా ఢీకొట్టడంతో సుమారు 15మీటర్ల దూరంలోకి పల్టీలు కొడుతూ ఆటో రోడ్డుపక్కన గుంతలో పడిపోవడం ప్రమాద తీవ్రతను తెలుపుతోంది. ఐచర్ వాహనం డ్రైవర్ పరారీలో ఉండగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుసూదన్‌రావు తెలిపారు.
రిసెప్షన్ (వలిమా)లో విషాద ఛాయలు :
సప్లయి సామగ్రి తీసుకొచ్చేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందండంతో కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో రిసెప్షన్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. కొద్ది గంటల్లో పెళ్లి సామాన్లతో వస్తారనుకున్న యువకుల దుర్మరణం పొందారన్న విషయం తెలుసుకున్న గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.