శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు
– రూ. 217 కోట్ల నష్టాల్లో ఆర్టీసీ
– కడప జోన్‌కు 149 కొత్త బస్సులు
– పెద్దనోట్ల రద్దుతో తగ్గిన 4 శాతం ఓఆర్
– ఆర్టీసీ ఈడీ రామారావు వెల్లడి
కోవెలకుంట్ల: శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కడప జోన్ నుంచి 380 ప్రత్యేక బస్సులు కేటాయించినట్లు ఆ జోన్ ఈడీ ఆర్. రామారావు చెప్పారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపోను తనిఖీ చేసి వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శివరాత్రి ఉత్సవాలకు కర్నూలు రీజియన్‌లోని 140 బస్సులతోపాటు అనంతపురం రీజియన్ నుంచి 140 బస్సులు, తిరుపతి నుంచి 60 సప్తగిరి బస్సులు, నెల్లూరు నుంచి 40 బస్సులు ప్రత్యేకంగా నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ బస్సులను ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు నుంచి శ్రీశైలంతోపాటు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలైన మహానంది, యాగంటి, ఓంకారం, తదితర ప్రాంతాలకు నడుపుతామని వెల్లడించారు. గత ఏడాది జోన్‌లోని కర్నూలు, కడప, అనంతపురం రీజియన్లలో రూ. 145 కోట్ల నష్టాలు ఉండగా ఈ ఏడాది ఆ నష్టం రూ. 217 కోట్లకు చేరిందన్నారు. ఖర్చులు, డీజల్ ధరలు పెరిగిపోవడం, ఓఆర్ తగ్గిపోవడం, కార్మికులకు వేతనాలు పెంపు, తదితర కారణాలు ఆర్టీసీకి నష్టాలు చేకూర్చయనా్నరు. రూ. 500, రూ.1000 నోట్ల రద్దు ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. జోన్‌పరిధిలో నవంబర్, డిసెంబర్ నెలలో 3–4 శాతం ఆక్యుపెన్సీరేటు తగ్గిందన్నారు.
జోన్‌కు ఇప్పటి వరకు 149 కొత్త బస్సులు రాగా వీటిలో 47 సూపర్ లగ్జరీ, 20 డీలక్స్, 82 ఎక్స్‌ప్రెస్ బస్సులను ఆయా డిపోలకు కేటాయించామన్నారు. మరో 411 బస్సులు రావాల్సి ఉందని చెప్పారు. కర్నూలు రీజియన్‌లో 40 మంది డ్రైవర్లు అదనంగా ఉండటంతో వారిని కడప రీజియన్‌కు బదిలీ చేసి అదనంగా ఉన్న 50 మంది కండక్టర్లను కర్నూలు జిల్లాకు బదిలీ చేశామన్నారు. ఇప్పట్లో కొత్తగా కండక్లర్, డ్రైవర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ లేనట్లేనన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాలబాటలో పయనింపచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆయా డిపోల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ టీములను బలోపేతం చేశామన్నారు. ఈ బృందాలు నిరంతరం రోడ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాయన్నారు. దశలవారీగా ఆర్టీసీ బస్టాండ్‌లను అభివృద్ధి చేస్తున్నామని ముందుగా జిల్లాకేంద్రాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల బస్‌స్టేషన్లపై దృష్టిసారించినట్లు వెల్లడించారు. తర్వాతి క్రమంలో శిథిలావస్థకు చేరుకున్న బస్టాండ్‌లను ఆధునికీకరిస్తామన్నారు. డిపోల్లో ఖాళీ స్థలాల్లో వాణిజ్య సముదాయాల ఏర్పాటుకు టెండర్లు పిలుస్తామన్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 9వ తేదీన కోవెలకుంట్ల బస్టాండ్ సమీపంలో 40 షాపుల నిర్మాణాలకు టెండర్లు పిలువనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు, నంద్యాల డిప్యూటీ సీటీఎం మధుసూదన్, ఈడీ ముఖ్య కార్యదర్శ వెంకటేశ్వరరెడ్డి, డిపో మేనేజర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.