శ్రీలంక మహిళ అక్రమనివాసం
రాజంపేట:
టూరిస్టు వీసాతో వైఎస్సార్ జిల్లా రాజంపేటకు వచ్చిన శ్రీలంక మహిళ దిశానాయకే ముదియన్‌శెలగే నంద అక్రమ నివాసం ఉన్నందువల్ల అరెస్టు చేసినట్లు రాజంపేట రూరల్ సీఐ హేమసుందరరావు తెలిపారు. ఈమేరకు శుక్రవారం అమె అరెస్టును విలేకర్ల సమావేశంలో
వెల్లడించారు. రాజంపేట మండలం తమ్మిరెడ్డిపల్లె గోపమాంబపురానికి చెందిన తమ్మిరెడ్డి విశ్వనాధరెడ్డిని నంద ప్రేమవివాహం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రాజంపేటలోని రాంనగర్‌లో అద్దె ఇంటిలో నివాసముంటున్నట్లు తెలిపారు. టూర్ వీసాతో వచ్చిన విదేశీయురాలు వీసాకాలం అయిపోయినా ఇక్కడే నిలిచిపోయిందన్నారు. చట్టవ్యతిరేకంగా ఇండియాలో ఉంటూ, భారతదేశవాసిగా దొంగపత్రాలు సృష్టించుకొని కొత్త పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. దీనిపై విచారణ అధికారి ఆర్వీ రసింహరావు(ఎస్‌బీహెచ్) ఫిర్యాదు మేరకు మన్నూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆమేరకు గురువారం రాంనగర్‌లో ఆమెను అరెస్టు చేసి, శుక్రవారం రాజంపేట జేఎఫ్‌సీఎం జడ్జి ఎదుట ప్రవేశపెట్టామన్నారు. 14రోజుల రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఆమెకు సహకరించిన తమ్మిరెడ్డి విశ్వనాథరెడ్డి అరెస్టు కావాల్సి ఉందన్నారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.