శ్రీకరీ! శుభకరీ! | srikari lalitha mandali parayanam | Sakshi
Sakshi News home page

శ్రీకరీ! శుభకరీ!

Published Thu, Jan 19 2017 10:43 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

శ్రీకరీ! శుభకరీ!

శ్రీకరీ! శుభకరీ!

వినూత్న ఆధ్యాత్మిక కార్యక్రమలకు శ్రీకారం
సహస్ర గళాలతో సహస్ర నామాల పారాయణకు సిద్ధమవుతున్న మహిళలు
 
నలుగురు ఆడవాళ్లు ఒకచోట చేరితే, చీరలు, నగల గురించి మాట్లాడుకుంటారని లోకంలో ఓ అపప్రధ. 1960 దశకంలో పత్రికల్లో ప్రచురితమయ్యే కార్టూన్లకు ప్రధాన ముడిసరుకు ఆడవాళ్లే. అప్పడాలకర్రతో అతివ, గచ్చకాయంత బొడిపెతో భర్త కనిపించని కార్టూను ఉండేది కాదు. తదనంతరం ప్రారంభమైన ‘టీవీ సీరియళ్లకు అతుక్కుపోయే’ ఆడవారిపై కార్టూన్లు నేటికీ కొనసాగుతున్నాయి. నలుగురు ఆడవారు ఒకచోట చేరితే, సమాజానికి ఉపకరించే ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను మూడు దశాబ్దాలుగా సమర్థంగా నిర్వహించగలరని శ్రీకరి లలితామండలి నిరూపిస్తోంది.
- రాజమహేంద్రవరం కల్చరల్‌
రాజమహేంద్రవరం, టి.నగర్‌లో నివసిస్తున్న గ్రంధి విజయలక్ష్మి పదోతరగతి చదువుకున్న ఓ మధ్యతరగతి మహిళ. చీకూచింతాలేని సంసారం. సమీపంలోని విశ్వేశ్వరస్వామి ఆలయానికి వెళ్లడం ఆమెకు అలవాటు. ఆమెకు మరో మధ్యతరగతి మహిళ పాలకోడేటి పద్మజ ఆలయంలో పరిచయమైంది. ఇద్దరూ కలసి పర్వదినాల్లో ఆలయంలో జరిగే సామూహిక పారాయణల్లో పాల్గొనేవారు. 1982లో గ్రంధి విజయలక్ష్మి వ్యవస్థాపకురాలిగా, ఏడుగురు మహిళలతో శ్రీకరి లలితామండలి ప్రారంభమైంది. మొదట్లో శ్రీకరి మహిళలలో జరిగే పారాయణల పరిధి పెరిగి, ఎవరు పిలిస్తే, వారింటికి వెళ్లి పారాయణలు చేయడం ప్రారంభించారు. మహిళల సంఖ్య ఏటా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సంఖ్య రెండు వందలు దాటింది.
‘ఇంతి’ంతై.. వటుడింతై
2009లో లక్ష కనకధారాపారాయణలు పూర్తి చేయాలని సంకల్పం కలిగింది. సుమారు ఒకటిన్నర సంవత్సరాల వ్యవధిలో లక్ష పారాయణలు పూర్తి చేశారు. పారాయణలు చేయమని జిల్లావ్యాప్తంగా ఆహ్వానాలు వచ్చాయి. అదే ఉత్సాహంతో వంద సౌందర్యలహరి పారాయణలు, 18 ఏకాదశలలో భగవద్గీతాపారాయణలు, వంద ఇళ్లలో వంద శివానందపారాయణలు శ్రీకరి మహిళలు పూర్తి చేశారు. అన్నమయ్య కీర్తనల శతగళార్చన, సహస్రగళార్చన, దశ సహస్రగళార్చనలు నిర్వహించారు. కొండవీటి జ్యోతిర్మయి దశసహస్రగళార్చనలో పాల్గొన్నారు. శ్రీవేంకటేశ్వరగానామృతం ఇప్పటి వరకు సుమారు 70 పారాయణలు పూర్తి చేశారు. ఏలూరు ప్రణవపీఠాధిపతి వద్దిపర్తి పద్మాకర్, ప్రచవన రాజహంస డాక్టర్‌ ధూళిపాళ మహాదేవమణి, భారతభారతి శలాక రఘునాథశర్మలు శ్రీకరి కార్యక్రమాల్లో పాల్గొని ఆశీస్సులను అందజేశారు. అంతేకాదు శ్రీకరీశాంకరీ సత్క్రియా సమ్మేళనం అనే ట్రస్టును స్థాపించి, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
సహస్రగళాలతో సహస్రనామాలు
ఈనెల 22వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు రాజమహేంద్రవరం హిందూ సమాజంలో వేయిమందికి పైగా మహిళలు లలితాసహస్రనామపారాయణలో పాల్గొంటారు. వశిన్యాది వాగ్దేవతలుగా ఎనిమిదిమంది మహిళలు కొలువుతీరుతారు. లలితాసహస్రనామాలు రాయించి ఉన్న 12 అడుగుల చీరెను ప్రదర్శిస్తారు. ట్రస్టు ద్వారా దివ్యాంగులకు సేవలను అందిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement