
మెంటలెక్కిస్తున్న రెంట్
రైతుబజార్లలో వ్యాపారులు బిత్తరపోయేలా మార్కెటింగ్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు.
- రైతు బజార్లలో వ్యాపారులు బిత్తరపోయేలా ప్రభుత్వ నిర్ణయం
- ఒక్కసారిగా రూ. ఐదు వేలు పెంచేసిన మార్కెటింగ్ శాఖ
- విద్యుత్ బిల్లుల బనాయింపు
- ఆందోళనలో వ్యాపారులు
రైతుబజార్లలో వ్యాపారులు బిత్తరపోయేలా మార్కెటింగ్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. 14ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన రైతు బజార్లలో ఎప్పుడూ లేని నిబంధనలు పెట్టి కుంగదీసే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ 14 ఏళ్ల పాటు ఎలాంటి అద్దెలు పెంచ లేదు. విద్యుత్ బిల్లులు బనాయించలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపారులపై కక్ష కట్టే విధంగా ఒక్కసారిగా అద్దెలు పెంచే నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారులనుంచి ముక్కుపిండి వసూళ్లు చేసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు.
పెదవాల్తేరు/ఎంవీపీకాలనీ :రైతుబజారులలో రైతుల తప్పా, మిగిలిన వ్యాపారుల నుంచి అద్దెలు, విద్యుత్ బిల్లుల రూపంలో భారీగా వసూళ్లు చేసేందుకు మార్కెటింగ్ శాఖాధికారుల రంగంలోకి దిగారు. ఒక్కసారిగా అద్దెలు రెట్టింపు చేయడంతో వ్యాపారులు కుదేలవుతున్నారు. పెంచిన అద్దెలకు తోడు విద్యుత్ బిల్లుల బనాయించడంతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అన్ని బజారులలో అద్దెలు పెంచడంతో వ్యాపారులు లాభాలకంటే అద్దెల భారం పెరిగిపోయిందంటూ ఆందోళన చెందుతున్నారు.
2010లో స్టాల్‌కు పదివేల అద్దె
రైతుబజారులో నిత్యావసరవస్తువులు, బియ్యం ఇతర దినుసులు విక్రయించేందుకు మార్కెట్ స్థాయి ప్రకారం గృహమిత్ర, బియ్యం దుకాణం, కో- ఆపరేటివ్ దుకాణం, సూపర్‌బజారు రెండుస్టాల్స్ కలిపి ఒకస్టాల్‌గా కౌంటర్లను కేటాయించారు. అప్పటి జేసీ పోలా భాస్కరరావు దుకాణానికి రూ.15వేలు చొప్పున అద్దెను పెంచారు. దీనిని వ్యాపారులు వ్యతిరేకించి, జేసీకి వినతిపత్రం అందజేయగా.. ఆ అద్దెను రూ.10వేలకు నిర్ణయించారు. చిన్న బజారుల్లో కౌంటర్‌కు రూ.5వేలు నిర్ణయించారు. నాటినుంచి నేటి వరకూ అదే కొనసాగుతోంది.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా...
2010 నుంచి నేటి వరకూ పైన తెలిపిన విధంగానే అద్దెలు చెల్లిస్తున్నారు. అయితే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా రూ.10 వేలు ఉన్న షాపు అద్దెను రూ.15వేలకు పెంచేయడం దారుణమని వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
అదనంగా విద్యుత్ బిల్లుల బనాయింపు
ఇప్పటికే వ్యాపారాలు లేక అద్దెల భారంతో ఇబ్బంది పడుతున్న వ్యాపారులకు పుండుమీద కారం చల్లినట్టు విద్యుత్ బిల్లులను అదనంగా కట్టమంటున్నారు. లెక్కాపత్తా లేకుండా మార్కెటింగ్ శాఖ అధికారులు కౌంటర్‌కు ఇంత అని బలవంతంగా వసూళ్లకు పూనుకుంటున్నారు.
పెద్దమార్కెట్లలో కౌంటర్‌కు నెలకు రూ.1000లు అయితే, చిన్న మార్కెట్‌లో నెలకు రూ.500 లు చొప్పన నిర్ణయించారు. అసలు కౌంటర్లలో విద్యుత్ వినియోగం మార్కెటింగ్ అధికారులు నిర్ణయించిన మేరకు ఉండదనేది వ్యాపారుల వాదన. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. ఈ విషయమై మార్కెటింగ్ శాఖ ఏడీ కాళేశ్వరరావును వివరణ అడగ్గా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.