
సంబురాలు అదరాలే..
♦ పండగ వాతారణంలో ఉత్సవాలు నిర్వహించాలి
♦ అమరుల స్థూపం వద్ద నివాళులతో కార్యక్రమాలు ప్రారంభం
♦ సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు కలెక్టర్ రోనాల్డ్ రోస్
సంగారెడ్డి జోన్ : రాష్ట్రావతరణ దినోత్సవ సందర్భంగా పండుగ వాతావరణంలో సంబురాలను ఘనంగా నిర్వహించాలని, ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ వేడుకల్లో జిల్లా ప్రజలంతా భాగస్వామ్యులై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ, మండల, పట్టణ ప్రాంతాల్లో జెండాలు ఎగురవేసి, మిఠాయిలు పంచిపెట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి పల్లె, ఆవాసాలు అవతరణ ఉత్సవాలను భారీ స్థాయిలో నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు, అన్ని వర్గాల ప్రజలు ఉత్సవాల్లో పాల్గొనాలన్నారు.
ఉదయం 8.30 గంటలకు మంత్రి హరీశ్‌రావు కలెక్టరేట్ కార్యాలయంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారని, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అవతరణ ఉత్సవాలను ప్రారంభిస్తామన్నారు. పరేడ్ గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరణ, మంత్రి సందేశం, సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో 25 మంది ప్రతిభావంతులకు జిల్లా స్థాయిలో రూ. 51,116 నగదు బహుమతి అందజేసి సత్కరిస్తారన్నారు. తెలంగాణ అమరుల కుటుంబాల్లోని 47 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామన్నారు. అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, అంధుల పాఠశాలల్లో దుస్తులు, మిఠాయిలు, తదితర పరికరాలను అందజేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. సాయంత్రం 4 గంటలకు ఐబీ నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాల్లో భాగంగా మైసూర్‌కు చెందిన రేవణ బృందం, హైదరాబాద్ సత్‌కళా భారతి బృందం, తమిళనాడు భూపాల్ కళా బృందం, సిద్దిపేట దుర్గాప్రసాద్ బృందంచే సాంస్కృతి కళా ప్రదర్శనలు ఉంటాయన్నారు. తెలంగాణ వంటకాలతో ఫుడ్ కోర్టు ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా కుటుంబం సమేతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. విలేకరుల సమాశంలో జేసీ వెంకట్రామిరెడ్డి, డీఆర్వో దయానంద్, సమాచార పౌర సంబంధాల సహాయ సంచాలకులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సూక్ష్మ గులాబీ జెండా
పెద్దశంకరంపేట: తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దశంకరంపేటకు చెందిన అవుసుల భవాని సూక్ష్మ తెలంగాణా జెండాను తయారు చేసి అందరి మన్ననలను పొందుతుంది.
ఫెవీ గమ్‌తో తెలంగాణా చిత్రపటంతో ఉన్న జెండా తయారీతో పాటు తెలంగాణా తల్లి ఫోటోలు, ప్రధాన మంత్రి నరేంద్రమోఢీ, సిఎం కెసిఆర్ చిత్రపటాలను గీసింది. గతంలో కూడా సూక్ష్మ కళాఖండాలను తయారు చేయడంతో పాటు చిత్రలేఖనంలో ప్రతిభ కనబర్చుతోంది. భవాని ప్రస్తుతం పేటలోని యువచైతన్య డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫైనల్‌ఇయర్ చదువుతోంది.