పనిచేయకుంటే నిలదీయండి
- కార్యకర్తల సమావేశంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు పనిచేయకుంటే నీలదీయాలని కేంద్రమంత్రి సుజనా చౌదరి టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కర్నూలు వీజేఆర్ కన్వెన్షన్ హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యాక‌్షన్‌కు దూరంగా అభివృద్ధిలో పోటీపడాలని సూచించారు. ఏ పని కావాలన్నా తనను కాలవాలని సూచించారు. కర్నూలు, కోడుమూరు నియోజకవర్గాల్లోని విబేధాలను పరిష్కరించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి కేంద్రమంత్రి సుజనా చౌదరికి సూచించారు. అంతకముందు తెలుగు యువత ఆధ్వర్యంలోమంత్రిని సన్మానించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి బీటీనాయుడు, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, ఎమ్మెల్యే మణిగాంధీ, ఆదోని, మంత్రాలయం, ఆలూరు, నందికొట్కూరు ఇన్‌చార్జీలు మీనాక్షినాయుడు, తిక్కారెడ్డి, వీరభద్రగౌడ్, మాండ్ర శివానందరెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, జెడ్పీ వైఎస్ చైర్మన్ పుష్పావతి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి, నాగేశ్వరయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి..
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా కర్నూలు చేరుకున్న కేంద్రమంత్రి సుజనాచౌదరి కలెక్టరేట్ ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం నీరు-ప్రగతి కార్యక్రమంలో భాగంగా సూదేపల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.