- కలెక్టర్‌కు విద్యార్థి సంఘం విజ్ఞప్తి
అనంతపురం సెంట్రల్ : జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ వీరపాండియన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కరువు జిల్లా అనంతలో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఎక్కువ కళాశాలలు నిబంధనల ప్రకారం లేవని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అపార్టుమెంట్లలోనూ, విద్యార్థులకు ఏమాత్రం సౌకర్యం లేని భవనాల్లోనూ కళాశాలలు నడుపుతున్నారని చెప్పారు.
అలాంటి వాటిపై ఆర్‌ఐఓకు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి, బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు.