నీరు-చెట్టు.. అంతా కనికట్టు | story on neer chettu scheme | Sakshi
Sakshi News home page

నీరు-చెట్టు.. అంతా కనికట్టు

Published Mon, Jun 26 2017 10:28 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

నీరు-చెట్టు.. అంతా కనికట్టు - Sakshi

నీరు-చెట్టు.. అంతా కనికట్టు

- పాత గుంతలకే కొత్త బిల్లులు
- రైతులకు దక్కని ప్రయోజనం


నీరు– చెట్టు పథకం టీడీపీ నేతలు, కార్యకర్తలు జేబులు నింపుకుంటున్నారు. దీనివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరేటట్లు కనిపించడం లేదు. ఏం చేసినా చెల్లుబాటవుతుందన్న రీతిలో తెలుగు తమ్ముళ్లు వ్యవహరిస్తుండగా.. వారు చెప్పినట్లు వినకపోతే ఎక్కడికి బదిలీ చేయిస్తారోనన్న భయం అధికారుల్లో నెలకొంది. వెరసి వందల కోట్ల రూపాయల నిధులు వృథా అవుతున్నాయి.
– ధర్మవరం

ఇరిగేషన్‌ డివిజన్‌        కేటాయించిన పనులు        ఖర్చు అంచనా మొత్తం (రూ.లక్షల్లో)
అనంతపురం              874                            10471.01
ధర్మవరం                  1095                           13552.6
పెనుకొండ                 2047                           17634.87
మొత్తం పనులు          4016                           41658,53

ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రాంతం ధర్మవరం మండలం ముచ్చురామి. ఈ గ్రామ సమీపంలో చేపట్టిన నీరుచెట్టు పనికి రూ.4.60 లక్షలు మంజూరు చేశారు. చెక్‌డ్యాంలో మట్టిని తొలగించి, డ్యాంను పటిష్టం చేయాల్సి ఉంది. అయితే ఈ పనుల్లో నిబంధనల మేరకు పూడిక తీసినట్లుగానీ, పూడిక మట్టిని రైతుల పొలాల్లోకి తరిలించలేదు. కేవలం చెక్‌డ్యాం చుట్టూ ఉన్న మట్టిని కొంత మేర తొలగించి మమా అనిపించారు.

జిల్లాలోని ధర్మవరం, పెనుకొండ, అనంతపురం ఇరిగేషన్‌ డివిజన్లకు కలిపి మొత్తం 4,016 పనులు చేపట్టేందుకు రూ.41658.53 లక్షల నిధులు కేటాయించారు. ఆయా నిధులతో జంగిల్‌ క్లియరెన్స్, చెరువులు, కుంటల్లో పూడికతీయడం, చెరువు కట్టలు, కుంట కట్టలను గట్టిపరచడం, అవసరమైన చోట కాంక్రీట్‌ రివిట్‌మెంట్‌ చేయడం, చెరువులు, కుంటల తూములకు మరమ్మతులు చేయడం తదితర పనులు చేసేందుకు గాను 2,211 పనులకు పరిపాలనా అనుమతి పొందారు. అయితే ఆయా పనులు ఎక్కడా నిబంధనల మేరకు జరగడంలేదు. ముఖ్యంగా అధికారులు కనీసం మార్కింగ్‌ కూడా ఇవ్వకనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయా పనులు చేసేశారు. పూడికతీత పనుల్లో కూడా భారీగా అక్రమాలు జరిగాయి. నామమాత్రంగా పనులు చేసి పూర్తిగా బిల్లులు చేయించుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

జన్మభూమి కమిటీలతే హవా
జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులే నీరు-చెట్టు పనులను చేజిక్కించుకుంటున్నారు.  కొన్ని గ్రామాల్లో నీరు చెట్టు కింద చేపట్టే పనులు తమకు దక్కలేదని గ్రామాల వారీగా అధికార పార్టీలో వర్గాలు రెండుగా చీలిపోయిన సందర్భాలు లేకపోలేదు. అధికార పార్టీ సర్పంచ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్న ప్రాంతాలకు మాత్రమే నిధులు మంజూరు చేశారన్న ఆరోపణలున్నాయి. వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్న గ్రామాలకు నీరు చెట్టు కార్యక్రమం కింద నిధులు మంజూరు చేయకపోవడం విశేషం.

అధికారులపై విమర్శల వెల్లువ
నీరు చెట్టు పథకం నిధుల స్వాహాపై అధికారుల్లో స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా ఆ శాఖలోని అధికారులకు బదిలీల భయం పట్టుకుంది. ఏ చిన్న అభ్యంతరం చెప్పినా.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని నేతల నుంచి ఫోన్లు వస్తుండటంతో వారు చేసేదిలేక మిన్నకుండిపోతున్నారు. మరికొందరు అధికారులు మాత్రం నాదేం పోయింది.. నీ ఇష్టం వచ్చినట్లు పనిచేసుకో.. మాకు ఇవ్వాల్సింది మాత్రం మాకు ఇచ్చేయ్‌.. అని  కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులతో జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement