టైఫాయిడ్‌కు విద్యార్థిని బలి | student dead | Sakshi
Sakshi News home page

టైఫాయిడ్‌కు విద్యార్థిని బలి

Published Tue, Sep 6 2016 9:26 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

టైఫాయిడ్‌కు విద్యార్థిని బలి - Sakshi

టైఫాయిడ్‌కు విద్యార్థిని బలి

  • నడుస్తూ వెళ్లి.. నిర్జీవమై వచ్చింది
  • గోపాలపురంలో విషాద ఛాయలు
  • పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి.. ఎన్నో ఆశలతో ఇంటర్మీడియట్‌ చదువుతున్న బాలికను టైఫాయిడ్‌ రూపంలో మృత్యువు కాటేసింది. ఆమెకు మంచి భవిష్యత్తు కల్పించాలన్న తల్లిదండ్రులకు గర్భశోకమే మిగిలింది. రావులపాలెం మండలం గోపాలపురంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
    – గోపాలపురం (రావులపాలెం)
     
    గోపాలపురం పంచాయతీ కార్యాలయం సమీపంలో నివసిస్తున్న ఓదూరి సత్యనారాయణ, లక్ష్మి కుమార్తె కాంచన(16) రావులపాలెంలోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ చదువుతోంది. వారం రోజుల కిత్రం ఆమె జ్వరం బారిన పడింది. తల్లిదండ్రులు రావులపాలెంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చూపించారు. టైఫాయిడ్‌ సోకినట్టు వైద్యుడు నిర్ధారించారు. నాలుగు రోజుల పాటు మందులు వాడినా జ్వరం తగ్గలేదు. తీవ్ర తలనొప్పి, వాంతులతో బాలిక పరిస్థితి విషమించడంతో, తిరిగి అదే ఆస్పత్రికి సోమవారం సాయంత్రం తీసుకువెళ్లారు. ఆమెను రాజమండ్రిలోని మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మరణించింది.
     
    చదువులో మేటి
    వ్యవసాయ కూలీ సత్యనారాయణ, లక్ష్మి దంపతులకు వెంకటేష్, కాంచన సంతానం. పేద కుటుంబానికి చెందిన కాంచన చదువులో రాణించింది. పదో తరగతితో చదువు మానేసిన వెంకటేష్‌ తన తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. కుటుంబంలో ఎవరూ పెద్ద చదువులు చదవకపోవడంతో కాంచన బాగా చదవాలని  కష్టపడేది. స్థానిక జెడ్పీ బాలికోన్నత పాuý శాలలో ఈ ఏడాది మార్చిలో పదో తరగతిలో ఉత్తమ పాయింట్లు పొంది, పాఠశాల ద్వితియ స్థానంలో నిలిచింది. దాతలు ఇచ్చిన నగదు ప్రోత్సాహంతో రావులపాలెంలోని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరింది. ఆమె కల తీరకుండానే తనువు చాలించింది.
     
    ఆ ఇంజెక్షనే ప్రాణం తీసింది
    జ్వరం తగ్గకపోవడంతో వైద్యులు చేసిన ఇంజెక్షనే తమ కుమార్తెను విషమ పరిస్థితిలోకి నెట్టిందని కాంచన తల్లిదండ్రులు విలపించారు. సోమవారం ఆస్పత్రిలో డెంగీ సోకిందేమోనని కాంచనకు వైద్య పరీక్షలు చేశారని, డెంగీ లేదని టైఫాయిడ్‌ మాత్రమే ఉందని చెప్పి ఇంజెక్షన్‌ చేశారని పేర్కొన్నారు. కాసేపటికి ఆమె నోటి వెంట, ముక్కు వెంట నురుగలు వచ్చి అపస్మారకస్థితికి చేరిందన్నారు. అక్కడి వైద్యులు అంబులెన్స్‌లో రాజమహేంద్రవరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి పంపించారన్నారు. అక్కడ రూ.30 వేలు కట్టించుకుని, తమ కుమార్తెను వైద్యానికి తీసుకువెళ్లారని, తెల్లవారుజామున తమ కుమార్తె చనిపోయిందని చెప్పారని కన్నీరుమున్నీరుగా విలపించారు. గత నెల 25న పుట్టిన రోజు చేసుకున్న కాంచన సోమవారం వినాయక చవితి పూజలో కూడా పాల్గొందని, నడుచుకుంటూ ఆస్పత్రికి వెళ్లిన ఆమె నిర్జీవమై ఇంటికి చేరిందని రోదించారు. ఈ సంఘటనతో గోపాలపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
     
    టైఫాయిడ్‌ పాజిటివ్‌
    కాంచనకు కొద్దిరోజుల కిత్రం వైద్య పరీక్షలు నిర్వహించగా, టైఫాయిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని గోపాలపురం పీహెచ్‌సీ వైద్యాధికారి ఎం.శివాజీ చెప్పారు. గ్రామంలో ఐదు బృందాలతో సర్వే నిర్వహించగా, ఎవరికీ టైఫాయిడ్‌ కానీ, డెంగీ కానీ సోకలేదని పేర్కొన్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement