గోపాలపురంలో అగ్ని ప్రమాదం
-
సిలిండర్ పేలి రూ.15 లక్షల ఆస్తినష్టం
రావులపాలెం :
రావులపాలెం మండలం గోపాలపురం కన్నాయిగూడెంలో సోమవారం సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం వాటిల్లిది. రెవెన్యూ అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నక్కా సత్యవతి ఆమె కుమార్తె శేషారత్నం తాటాకింటిలోని ఓ భాగంలో నివసిస్తున్నారు. మరో భాగంలో చల్లా దుర్గారావు కుటుంబం ఉంటోంది. సోమవారం సాయంత్రం టీ కాసేందుకు సత్యవతి చిన్న సిలిండర్ స్టౌ వెలిగించింది. అది భారీ శబ్దంతో పేలడంతో, ఆ ఇంటిలోని వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటనలో మంటలు వ్యాపించడంతో ఇల్లు దగ్ధమైంది. ఈ ఇంటి వెనుకే ఉన్న కన్నా నాగేశ్వరరావు ఇంటికి మంటలు వ్యాపించాయి. ఈ సంఘటనలో రెండు ఇళ్ల దగ్ధం కాగా, వాటిలో నివసిస్తున్న నక్కా సత్యవతి, చల్లా దుర్గారావు, కన్నా నాగేశ్వరరావు, సింగులూరి సత్యనారాయణ కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. ఈ సంఘటనలో బాధితులకు చెందిన బంగారు, వెండి వస్తువులు, నగదుతో పాటు గృహోపకరణాలు కాలిపోయాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. కాగా సత్యవతి ఇంటిలో రూ.10 లక్షలు, కన్నా నాగేశ్వరరావు ఇంటిలో రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్టు బాధితులు తెలిపారు.
సహాయక చర్యల్లో ఎమ్మెల్యే
సంఘటన విషయం తెలియగానే కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హుటాహుటిన అక్కడకు చేరుకని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. స్థానికులతో కలసి స్వయంగా మంటలను అదుపు చేశారు.కొత్తపేట ఫైర్ ఆఫీసర్ సీహెచ్ నాగేశ్వరరావు తన సిబ్బందితో మంటలను పూర్తిగా అదుపు చేశారు. బాధితులను జగ్గిరెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.20 వేలు నగదు సాయం అందజేశారు. తక్షణ సాయంగా రెవెన్యూ అధికారులు 40 కిలోల బియ్యం అందించారు. సుమారు రూ.3.5 లక్షల ఆస్తినష్టం వాటిల్లి ఉండవచ్చని ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు తెలిపారు.