రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
అన్న మృతిని తట్టుకోలేక చెల్లెలు ఆత్మహత్యాయత్నం
మడకశిర: మడకశిరలో శుక్రవారం వినాయక చవితి రోజు విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో రెండో సంవత్సరం డిప్లొమా చదువుతున్న సందీప్‌కుమార్ (19) కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాల్లోకెళితే... మడకశిరకు చెందిన ప్రకాష్ 108 వాహనంలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతని కుమారుడు సందీప్‌కుమార్ వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో రెండో సంవత్సరం డిప్లొమో చదువుతున్నాడు. వీరు పట్టణంలోని చర్చికాంపౌండ్‌లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం వినాయకచవితి సందర్భంగా వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వేడుకల్లో సందీప్‌కుమార్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు.
కార్యక్రమం పూర్తయిన తర్వాత సందీప్‌కుమార్ ద్విచక్రవాహనంలో ఇంటికి బయల్దేరాడు. కళాశాల గేట్ నుంచి రోడ్డుపైకి రాగానే పావగడ నుంచి తుమకూరుకు వెళ్లే కేఎస్ ఆర్టీసీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలైన సందీప్‌కుమార్‌ను కళాశాల సిబ్బంది, విద్యార్థులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సందీప్‌కుమార్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. సందీప్‌కుమార్ మృతిని తట్టుకోలేని చెల్లెలు బ్లెస్సీ (18) బ్లేడుతో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఎస్‌ఐ లింగన్న సంఘటన స్థలాన్ని పరిశీలించి, స్థానికులను విచారించారు. కేఎస్ ఆర్టీసీ బస్సును మడకశిర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే కళాశాల గేట్ వద్ద స్పీడ్ బ్రేకర్ వేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని ప్రజలు చర్చించుకోవడం కనిపించింది.
పండుగ పూట విషాదం..
Published Sat, Aug 26 2017 9:43 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement