మద్యం షాపులు తొలగించాలని విద్యార్థుల రాస్తారోకో
గుత్తి: పట్టణంలోని అనంతపురం, కర్నూల్ రోడ్లలో జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం షాపులను తొలగించాలని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కరస్పాండెంట్ వీకే సుధీర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమల్లేశ్వరరెడ్డి నేతృత్వంలో సుమారు 1500 మంది విద్యార్థులు 25 బస్సుల్లో గుత్తికి వచ్చి అనంతపురం రోడ్డులో మద్యం దుకాణాలకు ఎదురుగా రాస్తారోకో చేపట్టారు. గేట్స్ కాలేజీ విద్యార్థులు వస్తున్నారని సమాచారం తెలుసుకున్న మద్యం షాపుల నిర్వాహకులు వాటిని మూసివేసి ఇళ్లకు వెళ్లిపోయారు. సుమారు అరగంట సేపు రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ బాలికల హాస్టల్, కళాశాలలతో పాటు నివాసగృహాల మధ్య మూడు బ్రాందీ షాపులు ఏర్పాటు చేయడం ఎంత వరకూ సమంజసమన్నారు. విద్యార్థినులు కళాశాలకు రావాలంటే జంకుతున్నారని, మహిళలు ,పిల్లలు అటువైపు వెళ్లడానికే భయాందోళన చెందుతున్నారన్నారు. మహిళలు, విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతోందన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో సమాచారం తెలుసుకున్న సీఐ ప్రభాకర్ గౌడ్, ఎస్‌ఐ సుధాకర్ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. సమస్య ఉంటే ఎక్సైజ్ స్టేషన్‌కు వెళ్లి మాట్లాడాలని చెప్పడంతో విద్యార్థులంతా ఎక్సైజ్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ బైఠాయించి, ధర్నా చేశారు. అనంతరం ఎక్సైజ్ సీఐ రాజశేఖర్‌గౌడ్‌తో చర్చించారు.