సమావేశంలో మాట్లాడుతున్న వీసీ ముత్యాలునాయుడు
విజ్ఞానం తరగని ఆస్తి
Published Sat, Jul 23 2016 6:34 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
సీనియర్లు, జూనియర్ల మధ్య స్నేహపూరిత వాతావరణం ఉండాలి
నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) :
పంచుకుంటే ఆస్తులు తరిగిపోవచ్చు కానీ, విజ్ఞానాన్ని పంచుకుంటే ఇంకా పెరుగుతుందని, అది తరగని ఆస్తి అని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. వర్సిటీలో శనివారం నిర్వహించిన ఫ్రెషర్స్ డేలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జూనియర్లు, సీనియర్ల మధ్య స్నేహపూరిత వాతావరణం ఉండాలే తప్ప ఆధిపత్య పోరు ఉండరాదన్నారు. జూనియర్లకు సీనియర్లు ఆదర్శంగా నిలవాలే తప్ప, వారికి భయం కలిగించేలా ఉండరాదని చెప్పారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఎలికో సంస్థ ఎండీ డాక్టర్ దాట్ల రమేష్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఆటోమేషన్‌కు ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పారు. ఎంతో నైపుణ్యం ఉంటేనే కానీ ఉద్యోగాల్లో స్థిరపడటం సాధ్యం కాదన్నారు. దీనికోసం డొమైన్ నాలెడ్జ్ పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం పెంచాలని సూచించారు. ‘వందలో ఒకడిగా ఉంటావో, ఒక్కడివై వందమందికి ఉపాధి కలిగిస్తావో అనేది నీ చేతిలోనే ఉంది’ అని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ‘నన్నయ’ పేరుతో ఏర్పడిన వర్సిటీలో చదువుకునే అవకాశం లభించడం ఎంతో అదృష్టమని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విశ్రాంత ఉపకులపతి మాలకొండయ్య అన్నారు. గత పదేళ్లలో వర్సిటీ సాధించిన ప్రగతిని రిజిస్ట్రార్ డాక్టర్ కేఎస్ రమేష్ వివరించారు.
ర్యాగింగ్‌కి పాల్పడితే కఠిన చర్యలు
వర్సిటీలో ర్యాగింగ్ ఛాయలు ఎక్కడ కనిపించినా కఠిన చర్యలు తప్పవని స్టూడెంట్ అఫైర్స్ డీన్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు విద్యార్థులను హెచ్చరించారు. ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు రిజర్వేషన్ సౌకర్యాన్ని తొలిసారిగా నన్నయ యూనివర్సిటీ కల్పించిందని, దీనిని ఇతర వర్సిటీలు కూడా అనుసరిస్తున్నాయని ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సురేష్‌వర్మ తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త, నటుడు చేగొండి వీర వెంకట సత్యనారాయణమూర్తిచే ‘ఆంధ్ర సంస్కృతీ వైభవం’ పేరిట ప్రదర్శించిన పద్యగానలహరి విశేషంగా అలరించింది. కార్యక్రమంలో అకడమిక్ అఫైర్స్ డీన్ డాక్టర్ ఎస్.టేకి, సైన్స్ కళాశాల ్రíపిన్సిపాల్ డాక్టర్ మట్టారెడ్డి, సీడీసీ డీన్ డాక్టర్ వై.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement