
అనాథలకు అండగా నిలవడం అభినందనీయం
అనాథలకు అండగా నిలవడం అభినందనీయమని కర్నూలు ఎంపీ బుట్టారేణుక కితాబిచ్చారు.
– విజ్ఞాన పీఠానికి సోలార్, ఆర్‌ఓ వాటర్ ప్లాంట్, కూలింగ్ వాటర్ ఫ్రిజ్ వితరణ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): అనాథలకు అండగా నిలవడం అభినందనీయమని కర్నూలు ఎంపీ బుట్టారేణుక కితాబిచ్చారు. శనివారం విజ్ఞాన పీఠంలోని అరక్షిత శిశుమందిర్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలోని శ్రీసాయి ఆదరణ సేవా సమితి ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌ను సమకూర్చింది. అలాగే నందిరెడ్డి వినీల్‌రెడ్డి మిత్ర బృందం ఆరు పలకల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్, దొనపాటి యల్లారెడ్డి అనే యువకుడు..వాటర్ ఫ్రిజ్‌ను తమ సొంత ఖర్చులతో సమకూర్చారు. శనివారం ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వాటిని ప్రారంభించారు.
ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. విజ్ఞాన పీఠంలోని బాలబాలికల కోసం ఎంపీ నిధుల నుంచి మరుగుదొడ్లను నిర్మించాలని వీహెచ్‌పీ దక్షణాది రాష్ట్రాల అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి కోరగా అందుకు ఎంపీ సానుకూలంగా స్పందించారు. పాఠశాలకు ప్రహరీ నిర్మానానికి నిధులు మంజూరు చేయిస్తానని ఆమె హామీ ఇచ్చింది.
అనంతరం విజ్ఞాన సేవా సమితి, రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంపీ బుట్టారేణుక, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిలను సన్మానించి మెమొంటోలను అందజేశారు. విజ్ఞాన పీఠానికి దాతలు చేసే సాయానికి ఆదాయపు పన్ను మినాయింపును ఇస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ విషయాన్ని కర్నూలు జిల్లా ప్రజలు గుర్తుంచి అనాథల సేవకు ముందుకు రావాలని కోరారు. అంతకముందు విజ్ఞాన పీఠానికి రామకృష్ణ అనే వ్యక్తి రూ.50 వేలు, తిరుపాల్, అతని మిత్ర బృందం రూ.లక్షను ఎంపీ బుట్టా రేణుక చేతుల మీదుగా పాఠశాల కరస్పాండెంట్ గురుమూర్తికి అందజేశారు.
విజ్ఞాన పీఠంలోని అనాథలకు అన్నదానం కోసం ఎంపీ తమ బుట్టా ఫౌండేషన్ నుంచి రూ.25 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు బసవన్నగౌడ్, నగర అధ్యక్షుడు లక్కీరెడ్డి అమరసింహరెడ్డి, పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ సుబ్బారెడ్డి, డాక్టర్ శంకర్‌శర్మ, శ్రీధర్, ఏకాంబరరెడ్డి, బీసీ నాయకుడు నాగరాజుయాదవ్, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శౌరీ విజయకుమారి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.