తప్పు చేసినందుకే బాబుకు భయం | Suresbabu Mayor MLAs Rabindranath Reddy anjadbasafired on ap cm chandrababu | Sakshi
Sakshi News home page

తప్పు చేసినందుకే బాబుకు భయం

Published Sat, Mar 12 2016 3:38 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

తప్పు చేసినందుకే బాబుకు భయం - Sakshi

తప్పు చేసినందుకే బాబుకు భయం

రాజధాని భూ దందాపై సీబీఐ విచారణ జరిపించాల్సిందే
ఆధారాలిస్తే చర్యలు తీసుకుంటామనడం హస్యాస్పదం
దొంగ చేతికి ఎవరైనా తాళాలిస్తారా...?
వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి
మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా

కడప కార్పొరేషన్ : రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు సాగించిన భూ ఆక్రమణపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. వారు అక్రమాలకు పాల్పడినందుకే విచారణకు జంకుతున్నారన్నారు. శుక్రవారం ఇక్కడి వైఎస్‌ఆర్‌సీసీ కార్యాలయంలో మేయర్ కె. సురేష్‌బాబు, కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషాలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఫలానా ప్రాంతంలో రాజధాని వస్తుందని తెలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు వారి బినామీలు భూములు కొన్న తర్వాత రాజధానిని ప్రకటించారన్నారు. బలహీన వర్గాల వారి భూములు మాత్రమే ల్యాండ్ ఫూలింగ్‌లోకి పోయేలా మార్కింగ్ వేశారన్నారు.

దీనిపై సీబీఐ విచారణ చేయాలని అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌సీపీ డిమాండ్ చేస్తే, ఆధారాలివ్వండి చర్యలు తీసుకుంటామన్నారే తప్ప విచారణకు ముందుకు రాకపోవడం చూస్తుంటే తప్పు చేసినట్లేనన్నారు. దొంగచేతికి ఎవరైనా తాళాలిస్తారా అని ఆయన ఎద్దేవా చేశారు.  రాజధాని కోసం 25 వేల ఎకరాల ఫారెస్ట్ భూములు తీసుకున్నారని, అందుకు బదులుగా వైఎస్‌ఆర్ జిల్లాలో 50 వేల ఎకరాల భూములు ఇవ్వడానికి ప్రతిపాదించడం అత్యంత దుర్మార్గమన్నారు. విభజన చట్టంలోని ప్రత్యేక హోదా, జిల్లాకు ఉక్కు పరిశ్రమ, ఉర్దూ యూనివ ర్సిటీ వంటి వాటికి కేంద్రం నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందని చెప్పారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయిన ముఖ్యమంత్రి.. ఆ పార్టీ ఎంపీలను కూడా  దీనిపై గట్టిగా ప్రశ్నించవద్దని నియంత్రిస్తున్నారని తెలిపారు.  రాజధానిలో వేల ఎకరాలు భూములు కొన్న మంత్రులను తొలగించకుండా వార్తలు రాసిన పత్రిక, విలేకరులపై చర్యలు తీసుకుంటామనడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని తెలిపారు.

కాలువ గట్లపై పడుకొంటేనో, గడ్డాలు పెంచితేనో నీళ్లు వస్తాయా..?
కాలువ గట్లపై పడుకొంటేనో, గడ్డాలు మీసాలు పెంచితేనో గాలేరు నగరి, గండికోటకు నీళ్లు రావనే సత్యాన్ని ముఖ్యమంత్రి, ఆ పార్టీ నాయకులు గ్రహించాలని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి చురకంటించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని కేంద్రానికి అప్పగిస్తే వారే పూర్తి చేస్తారని, అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తన కమీషన్ల కోసం పాత కాంట్రాక్టర్‌నే కొనసాగిస్తోందని చెప్పారు. గాలేనగరి, గండికోటకు గత ఏడాది జూలై 1నాటికి నీళ్లు ఇస్తామని చెప్పారని, ఆ పనులన్నీ పూర్తి కావాలంటే రూ. 1300 కోట్లు కావాలన్నారు. ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన 348 కోట్లు ఏ మూలకు సరిపోవన్నారు. హంద్రీ-నీవాకు కేటాయించిన రూ. 504 కోట్లు కరెంట్ బిల్లులకే సరిపోతాయన్నారు. కేసీకెనాల్ ఆధునికీకరణకు కేవలం రూ.35 కోట్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏమిటో ఈ కేటాయింపులను బట్టే తెలుస్తోందని ఎద్దేవా చేశారు. డ్వాక్రా రుణాలు, రైతుల రుణాలు మాఫీ చేస్తామని దారుణంగా మోసం చేశారని, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులు, యువతను దగా చేశారన్నారు.  ప్రజలంతా తిరగబడితే తప్ప ఈ ప్రభుత్వానికి బుద్దిరాదని తెలిపారు.

సీబీఐ విచారణ జరిపించాలి
రాజధాని భూ ఆక్రమణపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరిపించాలని కడప శాసన సభ్యుడు ఎస్‌బి అంజద్‌బాషా డిమాండ్ చేశారు. నూజివీడు సమీపంలో నాగార్జున యూనివర్సిటీ వద్ద రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు లీకులిచ్చి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో తుళ్లూరు వద్ద వేల ఎకరాలు కొనుగోలు చేయించారన్నారు. ఆ తర్వాతే రాజధాని ప్రకటన చేశారని ఆరోపించారు. పిట్టకొంచెం కూత ఘనం అన్నట్లుగా రాష్ట్ర బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 10 శాతంగా ఉన్న మైనార్టీలకు బడ్జెట్లో కేవలం రూ.710 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. బీసీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పార ని, బడ్జెట్‌లో దాని ఊసే లేదన్నారు. రైతు రుణమాఫీకి కేటాయించిన రూ.3512 కోట్లు వడ్డీలకు కూడా సరిపోవన్నారు. హౌసింగ్‌కు కేటాయించిన రూ. 1100 కోట్లు పెండింగ్ బిల్లులు ఇచ్చేందుకు కూడా చాలవని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement