నిలువెత్తు నిజాయతీ
నిలువెత్తు నిజాయతీ
Published Sat, Aug 27 2016 5:21 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
వేములవాడ : పైసా కోసం ప్రాణం తీసే కర్కోటకులున్న సమాజం.. ఆస్తి కోసం అన్నదమ్ములను హతమార్చుతున్న వైనం.. పుక్యానికి వస్తే ఫినాయిల్ తాగే తత్వం.. తామే దేశోద్ధారకులమని డాంబికాలు చెప్పే కాలం.. అవినీతి, అక్రమాలంటే ఏంటో తెలియనే తెలియమంటూనే భారీగానే సొమ్ము చేసుకునే జనం.. అవినీతి, అక్రమాలు, బంధు, కులప్రీతితో కుమ్ములాడుకుంటూ.. మానవత్వాన్నే విస్మరిస్తున్న సమాజంలో కళ్లెదుటే రూ.వేలకు వేలు కనిపించినా ‘ఇది నాది కాదు.. అభాగ్యులెవో పోగొట్టుకున్నారు.. వారిని వెతికి ఇది అప్పగించాల’నే నిజాయతీతో సమాజానికి స్ఫూర్తినిస్తున్నారు ఆటోడ్రైవర్ రాజు.
శ్రీరాముల రాజు ట్రాక్టర్‌పై రోజూవారీ కూలీ. తర్వాత ట్రాక్టర్ డ్రైవర్‌గా మారాడు. వేములవాడ విద్యానగరంలో నివాసం. ఏడేళ్లపాటు ట్రాక్టర్ నడపి కుటుంబాన్ని పోషించుకున్నాడు. ట్రాక్టర్ నడపడంతో అనారోగ్యం బారినపడ్డాడు. రూ.60 వేలు అప్పు చేసి ఆటో కొనుగోలు చేశాడు.
కుటుంబ నేపథ్యమిది...
రాజవ్వ– రాజయ్య దంపతులు. రాజవ్వ రోజూవారీ కూలీ. రాజయ్య గొర్రెలకాపరి. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. అక్క ఎల్లవ్వ. అన్నయ్య నరేందర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తమ్ముడు నవీన్ ట్రాక్టర్ డ్రైవర్. మధ్యలో రాజు. ఈయనకు భార్య లత, కుమారుడు స్వాత్విక్, కుమార్తె దీక్షిత. ఎములాడ సర్కారు బడిలో ఎనిమిదో తరగతి వరకు చదివాడు. చదువు ఇష్టంలేక ట్రాక్టర్‌పై లేబర్‌గా.. తర్వాత డ్రైవర్‌గా పనిచేశాడు. ఆటో నంబర్ ఏపీ 15 టీబీ–7670, పోలీసులిచ్చిన టాప్ నంబర్ వీఎండీ–278. డ్రైవింగ్ లైసెన్సు నంబర్ 8483/ 2012. ఆధార్‌కార్డు నంబర్ 3502–9324– 5498.
ఐదువేలు పోగొట్టుకుని..
రాజు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ సమయంలో రూ.5వేలు వేతనం. జీతం తీసుకుని ఇంటికి బయలుదేరాడు. ఆ సొమ్మున్న బ్యాగు ఎక్కడో పోయింది. వెతికినా దొరకలేదు. అసలే పేదకుటుంబం. నెలంతా కష్టపడితే వచ్చిన సొమ్ము పోవడంతో ఆ నెల కుటుంబపోషణ ఎంతో కష్టమైంది. అదే టర్నింగ్ పాయింటయ్యింది. ఎవరైనా డబ్బులేకాదు.. ఇతర విలువైన వస్తువులు పోగొట్టుకున్నా బాధితుల చిరునామా తెలుసుకుని మరీ వారికి అందజేస్తున్నాడు. ఇటీవల వరంగల్‌కు చెందిన ఇద్దరు వేములవాడ రాజన్నను దర్శించుకుని రాజు ఆటోలో బస్టాండ్‌కు బయలు దేరారు. ఆటోలోనే రూ.15 వేలు ఉన్న బ్యాగు మర్చిపోయారు. తర్వాత గమనించిన రాజు.. వాళ్లకి సొమ్ము ఇచ్చేంత వరకూ ఆటో నడపలేదు. సమీపంలోని పోలీసు ఔట్‌పోస్టులో బ్యాగు అప్పగించాడు. అందులోని కాగితాలు, ఆధార్ ఇతరత్రా ఆనవాళ్ల ఆధారంగా బాధితులకు ఫోన్ చేసిన పోలీసులు.. వాళ్లు స్టేషన్‌కు రాగానే బ్యాగు, రూ.15వేలు అందజేశారు.
ఉదయం 6 గంటలకే రోడ్డుపైకి..
రోజూ ఉదయం 6 గంటలకే ఆటోతో రోడ్డుపైకి చేరుకుంటాడు. అతడికి చాలామంది పరిచయస్తులున్నారు. ఏ అవసరం ఏర్పడినా ఫోన్ నంబరు ద్వారా ఇంటికి పిలిపించుకుంటారు. ఆపద సమయాల్లో ఆస్పత్రులకు ఏ వేళలోనైనా వెళ్తాడు. రాత్రి 9 గంటలకు ఆటోతో ఇంటికి చేరితే మిగిలేది రూ.300– రూ.400 ఆదాయం.
సాయం చేయడంతోనే గుర్తింపు
ఇతరులకు సాయంచేయడంతోనే నాకు మంచి గుర్తింపు వచ్చింది. వక్రమార్గంలో సంపాదించిన సొమ్ముతో జల్సాలు చేసినా.. మంచి గుర్తింపు మాత్రం రాదు. ప్రజల్లో ఇట్లాంటి గుర్తింపు రావడమే నాకు ఆనందం. ఓ వ్యక్తి నా ఆటోలో మర్చిపోయిన బ్యాగును పోలీసుల ద్వారా బాధితుడికి ఇచ్చిన. నా నిజాయతీకి మెచ్చిన సీఐ శ్రీనివాస్ సార్ నాకు వెయ్యిరూపాయలు ప్రోత్సాహకంగా అందించడం జీవితంలో మర్చిపోలేను. నాలాగేనే నా పిల్లలను కూడా క్రమశిక్షణతో పెంచుతున్న.
Advertisement