'తిరుపతి కొండలు తవ్వండి.. భక్తులు ఊరుకుంటారా ?'
విశాఖపట్నం : 'బాక్సైట్' వ్యతిరేక ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని విశాఖపట్నంలోని శ్రీ శారదాపీఠం స్వామిజీ శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. శుక్రవారం విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు, పెద్దబయలు మండలాల్లో స్వరూపానందేంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులకు దుప్పట్లు, చీరలు ఆయన అందజేశారు.
అనంతరం స్వరూపానందేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని గిరిజన సంపదను కొల్లగొట్టేందుకు యత్నం జరుగుతోందని, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని ఆయన ఆరోపించారు. పురాణకాలంలో రాముడు, కృష్ణుడు నడియాడిన కొండలివని తెలిపారు. ఆంజనేయుడూ ఓ గిరిజనుడే అని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి గుర్తు చేశారు.
చేతనైతే తిరుపతి, సింహాచలం కొండలను తవ్వండి అని టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆ కొండలు తవ్వితే భక్తులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ప్రతి ఆదివాసీ బాక్సైట్ తవ్వకాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. విదేశీ మూకలను తరిమికొట్టండని గిరిజనులకు ఆయన సూచించారు.
విశాఖపట్నం జిల్లా అరకులో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ టీడీపీ ప్రభుత్వం జీవో 97ను జారీ చేసింది. ఈ జీవోపై ప్రజలు, గిరిజనలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సదరు జీవోను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.