కృష్ణా, గోదావరితో జిల్లా సస్యశ్యామలం
♦ పాలమూరు, డిండి, ప్రాణహితతో సాగులోకి 4.35 లక్షల ఎకరాలు
♦ సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం
♦ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
♦ జిల్లా ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : కృష్ణా, గోదావరి జలాలతో రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. పాలమూరు- రంగారెడ్డి, చేవెళ్ల- ప్రాణహిత, డిండి ప్రాజెక్టుల ద్వారా 4.35 లక్షల ఎకరాలను స్థిరీకరిస్తామని చెప్పారు. సోమవారం శాసనసభ ఆవరణలోని కమిటీ హాల్‌లో మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి జిల్లా ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సాగునీటి రంగ ప్రాజెక్టులపై అనుమానాలను నివృత్తి చేసిన ఆయన.. పాలమూరు- రంగారెడ్డి పథకం కింద 2.75 లక్షల ఎకరాలను సాగులోకి తేనున్నట్లు చెప్పారు.
గత పాలకులు కేవలం 2.10 లక్షల ఎకరాలకు నీరందించే ఏర్పాట్లు చేసి అనుమతులు లేకుండా పనులు ప్రారంభించారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని దుయ్యబట్టారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా వికారాబాద్‌కు 35వేలు, పరిగి 38వేలు, తాండూరు 98వేలు, చేవెళ్లకు 27వేలు, ఇబ్రహీంపట్నంకు 25,400, రాజేంద్రనగర్ 6,600 ఎకరాలకు సేద్యపు నీరు అందించి తీరుతామని స్పష్టం చేశారు. డిండి ప్రాజెక్టుతో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలను సాగులోకి తేనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ప్రాణహిత -చేవెళ్ల ద్వారా మేడ్చల్‌లో 6వేల ఎకరాలను స్థిరీకరిస్తామని, మేటిగడ్డ ప్రాజెక్టు నీరు అందదనే అపోహ వద్దని అన్నారు.
జిల్లాలో చెరువులు, చిన్న నీటి వనరుల పథకాలను పునరుద్ధరించడం ద్వారా సాగునీటి వనరులను పెంపొందిస్తామన్నారు. మూసీనది విస్తరణతో జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గానికి మేలు జరుగుతుందన్నారు. నారాయణరావు ఛానల్ మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు సంజీవరావు, వివేక్, కిషన్‌రెడ్డి, యాదయ్య, గాంధీ, తీగల కృష్ణారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గాంధీ, సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.