అవినీతి వార్డెన్లపై చర్య తీసుకోవాలి
Published Sun, Aug 28 2016 10:18 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
అచ్చంపేట : అచ్చంపేట నియోజకవర్గంలో సంక్షేమ వసతిగృహాల విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారని ఏఐఎస్‌ఎఫ్ డివిజన్ కార్యదర్శి కె.బాలగౌడు అన్నారు. ఆదివారం అచ్చంపేట ఆర్‌అండ్‌బీ అతిథిగహంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ వార్డెన్లు అవినీతికి పాల్పడుతూ విద్యార్థుల పొట్టగొడుతున్నారని ఆరోపించారు. కొన్ని హాస్టల్ వార్డెన్లు విద్యార్థుల సంఖ్య అధికంగా రిజిస్టర్లలో నమోదు చేస్తూ వారిపేరుమీద డబ్బులు డ్రా చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడంలో జిల్లా అధికారులు చొరవ చూపడంలేదని, హాస్టల్స్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ మిషన్లు పనిచేయడంలేదని అన్నారు. మెనూప్రకారం భోజనం అందించడంలేదని, నాసిరకం ఆహారపదార్థాలను విద్యార్థులకు అందిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా సంక్షేమాధికారులకు తెలియజేస్తామని, పరిష్కారం కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు రాజునాయక్, కుర్మయ్య, బిక్షపతి, శ్రీరామ్, రమేష్, నిరంజన్, శివ, మల్లేష్ పాల్గొన్నారు.
Advertisement