* మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
* వల్లాల గ్రామంలో ఘటన
* ఫిర్యాదుదారుడి ఇంటి ఎదుట బంధువుల ఆందోళన
వల్లాల (శాలిగౌరారం) : చిన్న తగాద ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. మండలంలోని వల్లాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. వల్లాల గ్రామానికి చెందిన జాల మహేశ్ (20), అదే గ్రామపంచాయతీ పరిధిలోని జోలంవారిగూడెంకు చెందిన జోలం నరేందర్ మధ్య కొంత కాలంగా పాత కక్షలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం ఇరువురు గొడవ పడటంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో రాజీపడ్డారు. అయితే ఈనెల 17న మరోమారు జాల మహేశ్ తన స్నేహితులతో కలిసి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించాడంటూ జోలం నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈనెల 18న పోలీసులు మహేశ్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. సాయంత్రం గ్రామానికి చెందిన ఓ పెద్దమనిషి జామీనుపై ఇంటికి పంపిస్తూ తిరిగి ఆదివారం మళ్లీ స్టేషన్‌కు రావాలని, తన స్నేహితులను కూడా తీసుకురావాలని ఆదేశించారు.
దీంతో మనస్తాపానికి గురైన మహేశ్ ఆదివారం ఉదయం తమ వ్యవసాయ బావివద్దకు వెళ్లి పురుగులమందు తాగాడు. ఆ సమయంలో బావి వద్దకు వెళ్లిన తండ్రి సైదులు కుమారుడి గమనించి లబోదిబోమనడంతో చుట్టుపక్కల వారు వెంటనే నకిరేకల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
బంధువుల ఆందోళన...
మహేశ్ మృతికి జోలం నరేందర్‌తో పాటు పోలీసులు కారణమంటూ మృతుడి తల్లిదండ్రులు, బంధువులు నరేందర్ ఇంటి ముందు, పోలీస్‌స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
సాయంత్రం వరకు నరేందర్ కుటింబీకులలో ఒక్కరు కూడా అందుబాటులోకి రాకపోవడంతో మహేశ్ మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. అప్పటికే పోలీస్‌స్టేషన్‌లో ఉన్న శాలిగౌరారం, నకిరేకల్ సీఐలు ప్రవీణ్, సుబ్బిరామిరెడ్డి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి నచ్చజెప్పారు.
పోలీసులకు సంబంధం లేదు : ఎస్‌ఐ
ఇదిలా ఉండగా ఎస్‌ఐ శ్రీరాముల అయోధ్య మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు అందడంతోనే మహేశ్‌ను పిలిపించి తిరిగి పంపించామన్నారు. కావాలనే పోలీసులపై ఆరోపణలు చేయడం మంచిదికాదని, మహేశ్ మృతికి పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పోలీస్ బందోబస్తులో నార్కట్‌పల్లి, కట్టంగూరు ఎస్‌ఐలు మోతీరాం, నరేందర్, సత్యనారాయణతో పాటు సిబ్బంది ఉన్నారు.
ప్రాణం తీసిన ఫిర్యాదు..
Published Mon, Jun 20 2016 3:44 AM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM
Advertisement
Advertisement